nabha jail break
-
ఆ జైలుపై దాడి పోలీసులకు ముందే తెలుసు
పాటియాలా: దేశంలో సంచలనం సృష్టించిన నభా జైలు దాడి గురించి పోలీసులకు ముందే తెలుసా? తెలిసి కూడా ఎందుకు అప్రమత్తమవ్వలేదు? కేవలం అనుమానాలతోనే సరిపెట్టి పరిణామాన్ని చవిచూశారా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా పోలీసులే.. అది కూడా ఈ ఘటన జరగడానికి ముందే కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో రాశారు. గత ఏడాది(2016) నభా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ సెఖాన్, మరో నలుగురు సహచరులను తప్పించడంతోపాటు ఖలిస్తాన్ టెర్రరిస్టు హర్మీందర్ మింటూను బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో కొంతమంది ముఠా జైలుపై నేరుగా దాడి చేసిన విషయం తెలిసిందే. జైలు గేటు వద్ద సెంట్రీని బెదిరించి మరీ జైలు లోపలికి వెళ్లి కాల్పులు జరిపి వారితో పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మింటూను ఇతరులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పలు రికార్డులు పరిశీలించగా.. జూన్ 3, 2016లో రాసిన ఓ ఎఫ్ఐఆర్లో పెద్దమొత్తంలో సెక్యూరిటీ ఉండే జైలుపై గ్యాంగ్స్టర్లు దాడి చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హర్మీందర్ సింగ్ రోమీ, తన సహచరులను విడిపించేందుకు కుట్ర జరగొచ్చని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నత కార్యాలయాలకు, మేజిస్ట్రేట్‌కు కూడా పంపించారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్త లేకుండా ఉండటంపట్ల ఉన్నతాధికారులకు జైలు భద్రతా సిబ్బందిపై పలు అనుమానాలకు తావిస్తోంది. -
సంచలన విషయాలు వెల్లడించిన తీవ్రవాది
న్యూఢిల్లీ: నభా జైలు నుంచి తప్పించుకుని దొరికిన తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ ఇంటరాగేషన్ లో సంచలన విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తనను తప్పించేందుకు సహకరించిన హర్మీత్ తో ఇంటర్నెట్ లో ఛాటింగ్ చేసినట్టు చెప్పాడు. హర్మీందర్ లాహోర్ సమీపంలోని డెరాచల్ గ్రామంలో ఐఎస్ఐ రక్షణలో ఉన్నాడని వెల్లడించాడు. కంబోడియా, లావోస్, మయన్మార్, థాయలాండ్ లో తమ స్థావరాలున్నాయని.. వీటి ద్వారా తీవ్రవాదాన్ని ప్రేరేపించేందుకు ఐఎస్ఐ ప్రణాళికలు రచించిందని వెల్లడించాడు. నభా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రధాన కుట్రదారు తానేనని అంగీకరించాడు. జర్మనీ లోని ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ సానుభూతిపరులు, ఇంగ్లండ్ నుంచి సందీప్ అనే వ్యక్తి హవాలా మార్గంలో తనకు డబ్బులు పంపారని విచారణలో మింటూ వెల్లడించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పంజాబ్‌లోని నభా జైలు నుంచి ఆదివారం తప్పించుకున్న మింటూను ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో సోమవారం పట్టుకున్నారు. -
సిక్కులు చేయకూడని పని చేశాడు.. అయినా!
నభా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ.. 24 గంటలలోపే పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తనను గుర్తుపట్టకూడదని ప్రపంచంలో ఏ సిక్కూ చేయని పని చేశాడు. మీసాన్ని పూర్తిగా తొలగించుకుని, గెడ్డం కూడా బాగా పొట్టిగా కత్తిరించేసుకున్నాడు. సాధారణంగా సిక్కులు తమ జుట్టును, మీసాలను, గెడ్డాన్ని కత్తిరించుకోరు. కానీ మింటూ మాత్రం.. తనను చూస్తే ఎవరైనా ముస్లిం అనుకోవాలి తప్ప సిక్కుగా గుర్తుపట్టకూడదని భావించాడు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి ముంబై పారిపోదామని అనుకుంటుండగా.. పోలీసులకు చిక్కాడు. అంతకుముందు తాను 18 సంవత్సరాల పాటు ఉన్న గోవాకు వెళ్లిపోవాలన్నది మింటూ ప్లాన్ అని పోలీసులు చెప్పారు. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ అయిన మింటూపై పది ఉగ్రవాద కేసులు ఉన్నాయి. ఇంతకుముందు డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై బాంబుదాడి కేసులో కూడా మింటూ ప్రధాన నిందితుడు. 2014లో థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు పోలీసులు అరెస్టుచేశారు. ఆదివారం ఉదయం పోలీసు దుస్తుల్లో ఉన్న కొందరు సాయుధులు నభా జైలులోకి ప్రవేశించి, గాల్లోకి వందరౌండ్ల కాల్పులు జరిపి మింటూ సహా ఐదుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను తీసుకుని పారిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మింటూను 90 కిలోమీటర్ల దూరంలో హరియాణా వద్ద దింపారు. అక్కడ అతడు బస్సు ఎక్కి ఢిల్లీ వెళ్లాడు. ముందుగా జైల్లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడైన పర్వీందర్ సింగ్ పిండా ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆయుధాలతో పట్టుబడ్డాడు. వాస్తవానికి తాము మింటూను, కశ్మీర్ సింగ్‌ను తీసుకెళ్లడానికి రాలేదని, పలు హత్యకేసులు, హైవే దోపిడీ కేసుల్లో నిందితుడైన విక్కీ గౌండర్‌ను తప్పించడానికి వచ్చామని అతడు చెప్పాడు. అందివచ్చిన అవకాశాన్ని మింటూ కూడా వాడుకున్నాడు. -
చేయని నేరం.. ఛాతీలోకి బుల్లెట్..
-
చేయని నేరం.. ఛాతీలోకి బుల్లెట్..
సమానా: తండ్రి చనిపోయిన ఆ కుటుంబంలో ప్రస్తుతం ఆ అమ్మాయిమాత్రమే ఆడిపాడి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంట్లో ఇద్దరు సోదరులు ఉన్నప్పటికీ వారు చిన్నవాళ్లు కావడంతో తల్లికి తన సోదరులకు ఆమెనే ఆసరా. పెళ్లిల్లు ఇతర ఫంక్షన్లలో డ్యాన్సులు వేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. కానీ, దురదృష్టవశాత్తు ఆ అమ్మాయిని మృత్యువు కబళించింది. పోలీసుల తుటా రూపంలో ప్రాణాన్ని బలిగొంది. వాస్తవానికి ఆ బుల్లెట్ ఆమె వైపు రావాల్సింది కాదు.. అంత నేరం కూడా ఆమె చేయలేదు. కానీ అకారణంగా మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. ఆదివారం పాటియాలా జిల్లాలోని నభాం జైలుపై తెగబడిన 14 మంది దుండగులు గాల్లోకి భయంకరంగా కాల్పులు జరిపి అందులోని ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ ఇతర గ్యాంగ్స్టర్లను విడిపించిన విషయం తెలిసిందే. దీంతో వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు రాష్ట్రమంతటా.. హరియాణా, ఢిల్లీలో అప్రమత్తత ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా పోలీసులు అప్రమత్తత ప్రకటించి తనిఖీలు ప్రారంభించిన మూడు గంటల గడిచిన సమయంలో నేహ శర్మ (24) అనే యువతి మరో నలుగురు యువతులతో ఓ కారు వేగంగా వెళుతోంది. వాస్తవానికి వారు పాటియాలలో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో ఆడిపాడాల్సి ఉంది. సమయం ముంచుకొస్తుండంతో వేగంగా వెళుతున్నారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఆ కారు డ్రైవర్ కారు ఆపలేదు. సరిగ్గా ధార్మేరి స్టాప్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసుల్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షంషేర్ సింగ్ అనే కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్ నేరుగా వెళ్లి నేహ శర్మ ఛాతీలోకి దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పుల కారణంగా బైక్ పై, మరో కారులో వెళుతున్న వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే, ఆసమయంలో అంతకంటే ప్రత్యామ్నాయం లేదని, కాల్పులు జరిపిన పోలీసుపై హత్యానేరం మోపీ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. -
పొద్దున్నే జైలు బద్దలు ఎలా సాధ్యమైంది?
నభా(పాటియాలా): పంజాబ్.. నిరంతరం అప్రమత్తంగా ఉండే రాష్ట్రం. ఉగ్రవాదుల కదలికలతో ఎప్పటిప్పుడు పోలీసులే కాకుండా ఆర్మీ బూట్ల చప్పుడు కూడా అక్కడి వీధుల్లో వినిపిస్తుంటాయి. అలాంటి పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలోని నభా జైలు. సాధారణ ఖైదీలు ఉండే జైళ్లకే భద్రత కట్టుదిట్టంగా ఉండటంతోపాటు నిఘా నేత్రాలు కూడా పనిచేస్తుంటాయి. సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. ఇక అలాంటిది కొందరు ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు ఉన్న జైలుకు సంబంధించి పోలీసుల మరెంత అప్రమత్తంగా ఉండాలి. కానీ, అలాంటి జాగరుకత ఏదీ కూడా నభా జైలు వద్ద లేదని తెలుస్తోంది. అచ్చం సినీ ఫక్కీలో ఓ తెర మీద సినిమాలో చూస్తున్నట్లుగా దుండగులు తెగబడ్డారు. సరిగ్గా ఆదివారం ఉదయం తొమ్మిదిగంటల ప్రాంతంలో వాహనాల్లో 12 నుంచి 14 మంది దుండగులు పోలీసుల వేషాల్లో వచ్చారు. అందులో మూడు వాహనాలని జైలు వెలుపలే ఆపేశారు. తెలివిగా ఓ ఖైదీని తీసుకొచ్చామని చెప్పి సెంట్రీతో గేటు తీయించారు. ఆ వెంటనే అప్పటి వరకు తమ బ్లాంకెట్లకింద దాచుకున్న ఆయుధాలను తీసి నేరుగా గాల్లోకి కాల్పులు జరిపారు. ఏం జరుగుతుంతో తెలిసే లోపే లోపలికి వెళ్లి తమకు కావాల్సిన ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ మరికొందరు గ్యాంగ్ స్టర్లను విడిపించుకెళ్లారు. ఈ సంఘటన ఒక్కసారిగా పంజాబ్ ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భద్రత డొల్లను బయటపెట్టింది. ఈ సందర్భంగా వారికి సహకరించిన పర్మిందర్ సింగ్ అలియాస్ పిండాను అరెస్టు చేశారు. జైలు గోడలు బద్ధలు కొట్టేందుకు ప్రణాళిక రచించింది కూడా ఇతడే. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జైలుపైనే దాడి చేయడం అంటే మాములు విషయం కాదు.. అలా చేయాలంటూ ఆ జైలుకు సంబంధించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అయితే, అతడు పర్మిందర్ సింగేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా? లేదా జైలుకు సెక్యూరిటీ చూసుకునే వారికి అణువనువూ తెలుస్తుంది.. వారే పూర్తి వివరాలు పర్మిందర్కు అందించారా? అంతపెద్ద మొత్తంలో జైలులోకి వచ్చిన సాయుధులు ఒక్క సెంట్రీనికానీ, సెక్యూరిటీ సిబ్బందినిగానీ గాయపరచపోవడానికి గల కారణాలు ఏమిటీ? పై అధికారుల హస్తం ఇందులో ఉందా? దాడికి సంబంధించి ముందే జైలు సిబ్బందికి తెలుసా? పోలీసుల చేతికి పర్మిందర్ దొరికిపోయినప్పుడూ ఖలిస్తాన్ చీఫ్ హర్మీందర్ మధ్యలో దిగిపోయాడని చెప్పాడు. వీరందరు నేపాల్ లో కలుసుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపాడు. దీని ప్రకారం తప్పించుకున్నవారందరికీ ఎస్కేప్‌కు సంబంధించిన వివరాలు ఎవరు? ఎలా ? చేరవేశారు.. ఇంత జరుగుతున్నప్పటికీ జైలు సిబ్బంది ఎందుకు అప్రమత్తంగా లేకుండా పోయారు? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరీ హర్మీందర్ సింగ్? హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ మితిమీరిన సిక్కు మతాభిమాని. సిక్కులకు ప్రత్యేక రాజ్యస్థాపనే లక్ష్యంగా ఏర్పడిన ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కేఎల్ఎఫ్)కు చీఫ్ గాఉన్నాడు. ఇతడిపై దాదాపు 10 ఉగ్రవాద సంబంధ చర్యలకు పాల్పడిన కేసులు ఉన్నాయి. పంజాబ్ పోలీసులకు అతడు దొరకకుండా చాలాకాలం తప్పించుకు తిరిగాడు. 2008లో సిర్సాకు చెందిన దేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై కూడా దాడి చేసింది మింటూనే. 2010లో హల్వారా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన పాత్ర కూడా అతడిదే. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న అతడు థాయిలాండ్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రాగానే 2014నవంబర్ నెలలో అరెస్టు చేసి ప్రస్తుతం నభా జైలులో ఉంచారు. -
అత్యాధునిక ఆయుధాలు.. పది నిమిషాల్లో దాడి పూర్తి
మొత్తం పది మంది సాయుధులు.. అత్యాధునిక ఆయుధాలు.. పక్కా ప్లానింగ్.. జైలు లోపల ఖలిస్తాన్ చీఫ్ సహా ఐదుగురు ఉగ్రవాదులు. వాళ్లను తప్పించేందుకు చేసిన ఆపరేషన్ మొత్తం సరిగ్గా పదే నిమిషాల్లో ముగిసిపోయింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూను తప్పించేందుకు చేసిన ఈ ఆపరేషన్ కోసం వాళ్లంతా పోలీసు యూనిఫాంలు ధరించి వచ్చారు. పది ఉగ్రవాద కేసులలో నిందితుడైన కేఎల్ఎఫ్ చీఫ్‌ను పట్టుకోవడం అప్పట్లో పంజాబ్ పోలీసులకు పెద్ద విజయమే. అయితే.. పారిపోయిన మింటూను మళ్లీ పట్టుకోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఐదుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాడ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సాయుధులు పోలీసు దుస్తుల్లో ఉండి.. తనిఖీ కోసం ఓ ఖైదీని తీసుకొచ్చామని జైలు భద్రతా సిబ్బందికి చెప్పారు. చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ వ్యక్తిని తీసుకుని జైలు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. దాంతో వాళ్ల వాహనాలను జైల్లోకి అనుమతించారు. టయోటా ఫార్చూనర్ సహా రెండు వాహనాల్లో వచ్చిన ఆ ఉగ్రవాదులు.. నేరుగా లోపలకు వెళ్లిపో్యారు. ఉదయం 9 గంటల సమయంలో లోపలకు ప్రవేశించిన ఆ పదిమంది.. దాదాపు వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు. తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో జైల్లో భీకర వాతావరణం సృష్టించి, తమకు కావల్సిన వాళ్లను పదే నిమిషాల్లో తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. జైలు భద్రతా సిబ్బంది వద్ద అంత ఆధునిక ఆయుధాలు లేకపోవడంతో వాళ్లను ఎదిరించడం సాధ్యం కాలేదు. జైలు సిబ్బంది వద్ద ఉన్న ఓ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను కూడా వాళ్లు తీసుకుపోయారు. జైల్లో ఉన్న ఖైదీలంతా టిఫిన్ చేయడానికి బ్యారక్స్ నుంచి బయటకు వచ్చే సమయం చూసుకుని సరిగ్గా అప్పుడే లోపలకు ప్రవేశించారు. ముందుగానే తమవాళ్లకు చెప్పి ఉంచడంతో.. వాళ్లు సులభంగా వీళ్ల వాహనాల్లోకి చేరుకున్నారు. కాల్పులు కొనసాగుతుండగానే ఖలిస్తాన్ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.