సంచలన విషయాలు వెల్లడించిన తీవ్రవాది
న్యూఢిల్లీ: నభా జైలు నుంచి తప్పించుకుని దొరికిన తీవ్రవాది, ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ హర్మిందర్ సింగ్ అలియాస్ మింటూ ఇంటరాగేషన్ లో సంచలన విషయాలు వెల్లడించాడు. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. తనను తప్పించేందుకు సహకరించిన హర్మీత్ తో ఇంటర్నెట్ లో ఛాటింగ్ చేసినట్టు చెప్పాడు. హర్మీందర్ లాహోర్ సమీపంలోని డెరాచల్ గ్రామంలో ఐఎస్‌ఐ రక్షణలో ఉన్నాడని వెల్లడించాడు.
కంబోడియా, లావోస్, మయన్మార్, థాయలాండ్ లో తమ స్థావరాలున్నాయని.. వీటి ద్వారా తీవ్రవాదాన్ని ప్రేరేపించేందుకు ఐఎస్‌ఐ ప్రణాళికలు రచించిందని వెల్లడించాడు. నభా జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రధాన కుట్రదారు తానేనని అంగీకరించాడు. జర్మనీ లోని ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ సానుభూతిపరులు, ఇంగ్లండ్ నుంచి సందీప్ అనే వ్యక్తి హవాలా మార్గంలో తనకు డబ్బులు పంపారని విచారణలో మింటూ వెల్లడించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. పంజాబ్‌లోని నభా జైలు నుంచి ఆదివారం తప్పించుకున్న మింటూను ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో సోమవారం పట్టుకున్నారు.