చేయని నేరం.. ఛాతీలోకి బుల్లెట్..
సమానా: తండ్రి చనిపోయిన ఆ కుటుంబంలో ప్రస్తుతం ఆ అమ్మాయిమాత్రమే ఆడిపాడి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంట్లో ఇద్దరు సోదరులు ఉన్నప్పటికీ వారు చిన్నవాళ్లు కావడంతో తల్లికి తన సోదరులకు ఆమెనే ఆసరా. పెళ్లిల్లు ఇతర ఫంక్షన్లలో డ్యాన్సులు వేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది. కానీ, దురదృష్టవశాత్తు ఆ అమ్మాయిని మృత్యువు కబళించింది. పోలీసుల తుటా రూపంలో ప్రాణాన్ని బలిగొంది. వాస్తవానికి ఆ బుల్లెట్ ఆమె వైపు రావాల్సింది కాదు.. అంత నేరం కూడా ఆమె చేయలేదు. కానీ అకారణంగా మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.
ఆదివారం పాటియాలా జిల్లాలోని నభాం జైలుపై తెగబడిన 14 మంది దుండగులు గాల్లోకి భయంకరంగా కాల్పులు జరిపి అందులోని ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ సింగ్ అలియాస్ మింటూ ఇతర గ్యాంగ్స్టర్లను విడిపించిన విషయం తెలిసిందే. దీంతో వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు రాష్ట్రమంతటా.. హరియాణా, ఢిల్లీలో అప్రమత్తత ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా పోలీసులు అప్రమత్తత ప్రకటించి తనిఖీలు ప్రారంభించిన మూడు గంటల గడిచిన సమయంలో నేహ శర్మ (24) అనే యువతి మరో నలుగురు యువతులతో ఓ కారు వేగంగా వెళుతోంది. వాస్తవానికి వారు పాటియాలలో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో ఆడిపాడాల్సి ఉంది. సమయం ముంచుకొస్తుండంతో వేగంగా వెళుతున్నారు.
పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఆ కారు డ్రైవర్ కారు ఆపలేదు. సరిగ్గా ధార్మేరి స్టాప్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసుల్లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షంషేర్ సింగ్ అనే కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్ నేరుగా వెళ్లి నేహ శర్మ ఛాతీలోకి దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పుల కారణంగా బైక్ పై, మరో కారులో వెళుతున్న వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే, ఆసమయంలో అంతకంటే ప్రత్యామ్నాయం లేదని, కాల్పులు జరిపిన పోలీసుపై హత్యానేరం మోపీ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.