విమానంలో రెస్టు తీసుకున్న కింగ్ కోబ్రా!
భారీ వర్షాల కారణంగా చెన్నైలో మనుషులకే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తలదాచుకోడానికి సురక్షిత ప్రాంతం వెతుక్కుంటూ వెళ్లిన ఓ కింగ్ కోబ్రా.. చివరకు ఎంచక్కా ఓ విమానం ఎక్కేసి అందులో నిద్దురపోయింది. నగరంలోని విమానాశ్రయం కూడా భారీ వర్షాలతో మూతపడిన విషయం తెలిసిందే. అక్కడ పార్క్ చేసిన ఓ విమానం చక్రం కంపార్టుమెంటు లోపల ఈ కింగ్ కోబ్రా విశ్రమించింది. చెన్నై విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవ్వడంతో సిబ్బంది విమాన చక్రాలను శుభ్రం చేస్తుండగా ఈ కింగ్ కోబ్రా కనిపించింది.
దాన్ని సురక్షితంగా బయటకు తీసి, విమానాశ్రయానికి దూరంగా ఉన్న ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం ఐదు రోజుల పాటు మూతపడింది. ప్రధాన రన్‌వేతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో అక్కడి నుంచి విమానాలను నడిపించలేకపోయారు. ఇప్పుడు కూడా కేవలం స్వదేశీ ప్రయాణాలకు సంబంధించిన విమానాలను మాత్రమే నడుపుతున్నారు తప్ప అంతర్జాతీయ విమానాలను టేకాఫ్ గానీ, ల్యాండింగ్ గానీ చేయడం లేదు.