ఒడిశా : ఒడిశాలోని గంజాం జిల్లా గోలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. రండా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
డ్రైవర్ అతివేగంగా లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలి పరారైయ్యాడు. మృతులంతా దినసరి కూలీలనీ పోలీసులు చెప్పారు. మృతుల్లో ఇద్దరు కూలీలు శ్రీకాకుళం జిల్లా వాసులని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.