run over
-
ఖమ్మం: తాతా.. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయే!
ఖమ్మం: చావు అంచుల దాకా వెళ్లొచ్చిన.. ఓ తాతను చూసి అదృష్టవంతుడని అంతా అనుకుంటున్నారంతా. జిల్లాలోని ఎర్రుపాలెం రైల్వే స్టేషన్లో ఓ వృద్ధుడు నిర్లక్ష్యం ప్రదర్శించాడు. గూడ్స్ రైలు కింద నుంచి అవతలి ప్లాట్‌ఫామ్‌కు చేరే యత్నం చేశాడు. ఆ సమయంలో ఆ గూడ్స్ ఒక్కసారిగా కదిలింది. దీంతో ఆ తాత రైలు కిందపడిపోయాడు. అయితే.. అయితే తాత సమయస్ఫూర్తితో పట్టాల మధ్యే పడుకుండి పోయాడు. ఆ సమయంలో పక్కనే పట్టాల మధ్య ఓ వృద్ధురాలు(బహుశా ఆయన తాలుకానేమో) ఆయనకి ఏమవుతుందో ఏమోఅనుకుంటూ.. రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు.. గూడ్స్ డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ఆయన రైలును ఆపేశాడు. ఆ వెంటనే పట్టాల మధ్య బొక్కబోర్లా పడుకున్న తాతను బయటకు లాగేశారు ప్రయాణికులు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడికి చిన్న చిన్న గాయాలైనట్లు సమాచారం. -
దూసుకెళ్లిన లారీ : పది మంది మృతి
ఒడిశా : ఒడిశాలోని గంజాం జిల్లా గోలంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. రండా గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం గంజాం జిల్లా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలి పరారైయ్యాడు. మృతులంతా దినసరి కూలీలనీ పోలీసులు చెప్పారు. మృతుల్లో ఇద్దరు కూలీలు శ్రీకాకుళం జిల్లా వాసులని తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రచార వాహనం ఢీకొని చిన్నారి మృతి
హాజీపూర్ : బిహార్‌లో ఎన్నికల ప్రచార వాహనం ఢీకొని రెండేళ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైశాలి జిల్లా రాజపాకర్లో తన తాత ఇంటిముందు చిన్నారి ఆడుకుంటోంది. ఇంతలో అటుగా వచ్చిన ఆర్జేడీ ప్రచార వాహనం ఆ పాపను ఢీకొని వెళ్లడంతో పాప అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ వాహనం రాజపాకర్ అసెంబ్లీ నియోజకవర్గ ఆర్జేడీ అభ్యర్థి శివ చంద్రరామ్కు చెందినది. ఆ వాహనంలో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రచార సామగ్రిని తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.