'సీఎం అయి కూడా చప్రాసీ క్వార్టర్స్ లో ఉన్నా'
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు చిన్న క్లాస్ పీకారు. కాస్తా పద్ధతిగా మసులుకొని.. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తో కూడిన మహాకూటమి గౌరవాన్ని నిలుపాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ బంగ్లాల కోసం పరస్పరం కోట్లాటలకు దిగడం, ప్రభుత్వం అధికారికంగా నివాసాలు కేటాయించకముందే.. ముందే వెళ్లి వాటిలో పాగా వేసేందుకు పాకుతుండటంతో వారి తీరుపై లాలూ, ఆయన తనయుడు డిప్యూటీ సీఎం తేజస్వి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లాలూ తనదైన శైలిలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాలుగు నెలలు చప్రాసీ (ప్యూన్) క్వార్టర్ లో గడిపానని, ఈ విషయాన్ని కొత్త ఎమ్మెల్యేలు గుర్తించాలని సూచించారు.
'మహాకూటమి నేతృత్వంలోని ప్రభుత్వ గౌరవాన్ని కాపాడే బాధ్యత మీపై ఉంది. పద్ధతిగా వ్యవహరించండి. తప్పుడు పనులతో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకండి' అని లాలూ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. బిహార్ లో కొత్తగా ఎన్నికైన అధికార ఆర్జేడీ, జేడీయూ ఎమ్మెల్యేలు విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాల కోసం ఎగబడుతుండటం.. వివాదాస్పదంగా మారింది.