సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో నిషేధం ఎదుర్కుంటున్న చిత్రం ‘ముజఫర్ నగర్’ విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ చిత్రంపై ఎలాంటి నిషేధం లేదని.. చిత్రాన్ని ధైర్యంగా విడుదల చేసుకోవాలని నిర్మాతలకు సుప్రీంకోర్టు తెలిపింది. అవసరమైతే పోలీస్ బందోబస్తు కల్పించాలని యూపీ సర్కార్‌ను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ముజఫర్ నగర్ 2013 జరిగిన అల్లర్ల నేపథ్యంలో ముజఫర్ నగర్: ది బర్నింగ్ లవ్ చిత్రం తెరకెక్కింది. ఓ హిందూ కుర్రాడు.. ముస్లిం అమ్మాయిల మధ్య ప్రేమ కథ.. మతోన్మాదులకు వ్యతిరేకంగా యువకుడి పోరాటం తదితరాలతో దర్శకుడు దీనిని రూపొందించాడు. కొందరు ప్రేక్షకులకు ప్రివ్యూ ప్రదర్శించిన సెన్సార్ బోర్డు.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటంతో యూ/ ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నవంబర్ 17న చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కాగా.. యూపీలోని ఆరు జిల్లాల్లో మాత్రం విడుదల కాకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు.
దీంతో చిత్రంపై నిషేధం విధించినట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మోర్నా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ కన్విల్కర్, డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేపట్టింది. అయితే తామేం నిషేధం విధించలేదని యూపీ ప్రభుత్వం స్పష్టం చేయగా.. ఎక్కడా లిఖిత పూర్వక ఆదేశాలు లేకపోవటంతో పిటిషనర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. చిత్రాన్ని విడుదల చేసుకోవచ్చని నిర్మాతలకు చెబుతూ .. నిర్మాతలు కోరితే రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను కోర్టు ఆదేశించింది.
అయితే విడుదలలో జాప్యం కలగటంతో భారీ నష్టం వాటిల్లిందని.. కాబట్టి 50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలని పిటిషనర్ కోరగా.. కోర్టు మాత్రం తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment