న్యూఢిల్లీ: 2015-16 బడ్జెట్‌లో వేతన జీవులను ఉస్సూరుమనిపించిన విత్తమంత్రి జైట్లీ... జనం జేబుకు మాత్రం బాగానే చిల్లుపేట్టేశారు. సేవల పన్ను పెంపు ద్వారా దండిగా ఖజానాను నింపుకోనున్నారు. అయితే, మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కోసం దేశీయంగా తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కొన్ని ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గింపులు, మినహాయింపులు ఇచ్చారు. కొన్ని సేవలను సర్వీసు పన్ను పరిధి నుంచి తప్పించడం కూడా కంటితుడుపుకిందే లెక్క. మొత్తంమీద ఈ బడ్జెట్‌లో జనాలకు ఒరిగేది గోరంత... వదిలేది కొండంత అన్నది తేటతెల్లమైంది.
ఇవి పెరుగుతాయ్...
వాణిజ్య వాహనాలు(పూర్తిగా తయారై దిగుమతి చేసుకున్నవి)
ఎందుకంటే: దిగుమతి సుంకం 10% నుంచి 40%కి పెంపు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు, మద్యం.
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకాన్ని 15 శాతం నుంచి 25 శాతం మేర పెంచారు. ఆల్కహాల్ ఉత్పత్తిపైనా సర్వీసు పన్ను విధింపు.
రెస్టారెంట్లు-హోటళ్ల బిల్లులు, విమాన ప్రయాణం, బ్యూటీపార్లర్లు, స్పా సేవలు,. కేబుల్-డీటీహెచ్ సేవలు, ఫోన్ బిల్లులు, లాటరీ టికెట్లు, చిట్‌ఫండ్, మ్యూచువల్ ఫండ్ ఫీజులు, బీమా ప్రీమియం. అమ్యూజ్‌మెంట్ పార్కులు, సంగీత కార్యక్రమాల టిక్కెట్లు.
ఎందుకంటే: సేవల పన్నును 12.36% నుంచి(విద్యా సెస్సుతో కలిపి) 14 శాతానికి పెంచడం, కొన్నింటిని ఈ పన్ను పరిధిలోకి తీసుకురావడం.
సిమెంటు, ప్లాస్టిక్ బ్యాగులు
ఎందుకంటే: సిమెంటుపై ఎక్సైజ్ సుంకం టన్నుకు రూ.1,000 చొప్పున, ప్లాస్టిక్ బ్యాగులపై 12% నుంచి 15 శాతానికి పెంచడం
సుగంధ పానీయాలు, ప్యాకేజ్డ్ తాగునీరు.
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12% నుంచి 18 శాతానికి పెంపు.
దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 6% నుంచి 12.5 శాతానికి పెంపు.
ఇవి తగ్గుతాయ్...
ప్యాకేజ్డ్ పండ్లు, కూరగాయలు.
ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు.
మ్యూజియంలు, జూ-వన్యప్రాణి సంరక్షణ
(జాతీయ పార్కులు) కేంద్రాల సందర్శన.
ఎందుకంటే: సర్వీసు పన్ను నుంచి మినహాయింపు.
దేశీయంగా తయారయ్యే మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు.
ఎల్‌ఈడీ/ఎల్‌సీడీ ప్యానళ్లు, ఎల్‌ఈడీ బల్బులు-లైట్లు.
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం తగ్గింపు..
అంబులెన్స్, అంబులెన్సు సర్వీసులు.
ఎందుకంటే: సేవల పన్ను నుంచి మినహాయింపు
తోలు పాదరక్షలు(రూ.1,000 కంటే ఎక్కువ ధర)
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు.
అగర్‌బత్తీలు, పేస్ మేకర్లు.
ఎందుకంటే: ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు.
రిఫ్రిజిరేటర్లు, సోలార్ వాటర్ హీటర్లు. మైక్రోవేవ్ ఓవెన్లు.
ఎందుకంటే: విడిభాగాలు, పరికరాలపై దిగుమతి సుంకంలో కోత.
వదిలేదెంత.. మిగిలేదెంత?
Published Mon, Mar 2 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement