88వ పడిలోకి అద్వానీ... మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ శనివారం 88వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారణాసి పర్యటన నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ, ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
అద్వానీ ఇంటి బయటకు వచ్చి మరీ మోదీకి స్వాగతం పలికారు. ఆ సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు ఇతర బీజేపీ నేతలు కూడా అక్కడ ఉన్నారు. అంతకు ముందు అద్వానీకి మోదీ ట్విట్టర్‌లోనూ శుభాకాంక్షలు తెలిపారు.
అద్వానీజీ మంచి ఆరోగ్యంతో చిరకాలం జీవించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఎంతో మేధస్సు, ప్రావీణ్యం గల గొప్ప నేతగా అద్వానీని అభివర్ణించారు. తామంతా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. మరోవైపు స్వచ్ఛ్ భారత్‌లో పాలు పంచుకున్న దక్షిణాది అగ్ర నటుడు కమల్ హాసన్‌ను అభినందిస్తూ మోదీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
హిమపాతానికి ఇద్దరు సైనికుల మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఆకస్మికంగా సంభవించిన హిమపాతానికి ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఓ పౌరుడు బలయ్యారు. మరో జవాను గాయపడ్డారు. ఉత్తర కాశ్మీర్‌కు చెందిన కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) సమీపంలో శనివారం ఉదయం భారీ ఎత్తున హిమపాతం సంభవించింది. నాస్తాచున్‌పాస్ దక్షిణ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఆర్మీ బృందం ఈ హిమపాతంలో చిక్కుకుపోయింది. అకస్మాత్తుగా ముంచెత్తిన హిమపాతానికి గురై ఆర్మీ బృందంలోని ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి, మరో జవాను, ఓ పోర్టరు మరణించారు.