16వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : 16వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగుతోంది. ప్రోటెం స్పీకర్ కమల్నాథ్ గురువారంలోక్సభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు. సుష్మా స్వరాజ్ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకు ముందు ప్రోటెం స్పీకర్ కమల్ నాథ్ మూడు లోక్సభ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, సమాజ్వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రాజీనామాలను ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు. సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం కూడా కొనసాగనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 315 మంది కొత్తగా ఎన్నికయ్యారు.