న్యూఢిల్లీ: దేశంలో మానవ హక్కులను అనుక్షణం పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మానవ హక్కుల పరిరక్షణ(సవరణ)బిల్లు –2019 బిల్లుకు సభ ఆమోదం లభించింది. ఈ సందర్భంగా హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. మానవ హక్కులను అనునిత్యం కాపాడేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నామన్నారు. జాతీయ, రాష్ట్రాల మానవ హక్కుల సంఘాలకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించినట్లు తెలిపారు. ఈ బిల్లులో ప్రభుత్వం కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్‌హెచ్చార్సీ తోపాటు రాష్ట్ర మానవ హక్కుల సంఘాల చైర్‌పర్సన్, సభ్యుల పదవీ కాలం ప్రస్తుతమున్న ఐదేళ్లకు బదులు ఇకపై మూడేళ్లకే పరిమితం కానుంది.
ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తినే నియమించాలనే నిబంధనను ప్రభుత్వం సడలించింది. ఇకపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జినీ నియమించవచ్చని ప్రతిపాదించింది. జాతీయ మైనారిటీల కమిషన్ నుంచి ఎన్‌హెచ్చార్సీ చైర్‌పర్సన్‌ను నియమించాలన్న ఏఐఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ.. ఓబీసీ జాబితాలో మైనారిటీలను చేర్చే నిబంధన ఈ బిల్లులో ఉందన్నారు. అధికార పార్టీ ఎంపీలను ఎన్‌హెచ్చార్సీలో ఎందుకు నియమించాలని అనుకుంటున్నారని ఒవైసీ ప్రశ్నించారు. ఎన్‌సీపీ సభ్యురాలు సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఒక వైపు శాంతి కావాలంటూనే ఎన్‌హెచ్చార్సీ ఆదేశాలను సవాల్ చేసే పరిస్థితులున్నాయని, ఈ బిల్లుపై సభలో మరోసారి మరింత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు.
కర్ణాటకలో ప్రజాస్వామ్యం ఖూనీ
కర్ణాటకలో చట్టసభ స్వతంత్రత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కాంగ్రెస్ శుక్రవారం లోక్‌సభలో ఆందోళనకు దిగింది. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం, అక్కడి పరిణామాలపై చర్చ జరగాలంటూ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. వారి డిమాండ్‌పై స్పీకర్ ఓం బిర్లా సానుకూలంగా స్పందించడంతో ఆందోళన విరమించారు.
ఎన్‌హెచ్చార్సీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Published Sat, Jul 20 2019 6:32 AM | Last Updated on Sat, Jul 20 2019 6:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment