
ఇరవై ఏళ్లు నిండని యువకులు బతుకులను బలిపీఠంపై పెడుతున్నారు. ఆలోచనలను అదుపులో పెట్టుకోలేక ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. సినిమా ప్రభావానికి లోనై సహ విద్యార్థులతో ప్రేమలో పడి దాన్ని నెగ్గించుకునే దారి తెలీక ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. ఈ పెడ ధోరణి జిల్లా యువతలో ఇటీవల బాగా పెరిగింది. సిక్కోలు నలువైపులా వరుసగా చోటు చేసుకున్న బలవన్మరణాలే దీనికి నిదర్శనం. క్షణికావేశంలో కొందరు, ఆలోచన చేయలేక మరికొందరు, సరైన సూచనలు అందక ఇంకొందరు మృత్యువును ఆశ్రయిస్తున్నారు. యువతలో కనిపిస్తున్న ఈ మార్పు తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుస్తోంది. – రాజాం
కొత్త కారణం..
అప్పుల బాధలు తట్టుకోలేక, ఇంటి బరువులు మోయలేక, ఆర్థిక సమస్యలు పరి ష్కరించలేక ఇన్నాళ్లూ ఆత్మహత్యలు చేసుకోవడం చూశాం. కానీ ఇప్పుడు నిం డు నూరేళ్లు బతకాల్సిన చిరంజీవులు ఉత్తి పుణ్యానికి ఊపిరి ఆపుకుంటున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను, కనిపెట్టుకుని ఉండే స్నేహితులను కూడా కాదని ప్రేమ కోసం నిండు జీవితాన్ని బలి పెడుతున్నారు. వయసుతో పాటు వచ్చే ఆకర్షణను అర్థం చేసుకోలేక మితిమీరిన ఆలోచనలతో జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువతపై సినిమా చాలా ఎక్కువ ప్రభావం చూపుతోంది. హీరో హీరోయిన్లను అనుకరించడంతో పాటు ఆ పాత్రలను అనుసరించడంతో సమస్యలు వస్తున్నాయి.
జీవితం విలువ తెలుసుకోలేక..
కౌమార దశలో ఉన్న యు వత ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేకపోతున్నారు. వయసుతో పాటు సహజంగా వచ్చే మార్పులకు మితిమీరిన ఆలోచనలు తోడు కావడంతో వీరు పెడదారిన పడుతున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద, విద్యాలయాల్లో ఒత్తిడి కూడా వీరిని చిత్తు చేస్తోంది. టీనేజీ వయస్సులోకి అడుగుపెట్ట డంతో పాటు జల్సాల వైపు దృష్టిపెట్టడం, ఖాళీ సమయాల్లో సినిమాలకు వెళ్లడం, తల్లిదండ్రుల సావాసం మెల్లగా దూరమవుతుండడంతో ఘోరాలు జరిగిపోతున్నాయి.
మోసగిస్తున్న మొబైళ్లు
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా యువతను పక్కదోవ పట్టిస్తోంది. పదో తరగతిలోనే చేతికి సెల్‌ఫోన్ రావడంతో పుస్తకాలు చదివే అలవాటు, తద్వారా మానసిక పరిణితి పొందే అవకాశాలను యువత పూర్తిగా దూరం చేసుకుంటోంది. ఇష్టానుసారం వస్తున్న సోషల్ మీడియా పోస్టింగ్‌లతో పాటు అభూత కల్పనలు, చిన్నచిన్న కవితలు, మెసేజ్‌లు తెలియని స్నేహితులను కూడా దగ్గరకు చేర్చుతున్నాయి. స్నేహితుల మధ్య బంధాన్ని ప్రేమగా మార్చి యువతను మోసగిస్తున్నాయి.
అవగాహన కార్యక్రమాలేవీ?
గతంలో ప్రభుత్వ కళాశాలల్లో ర్యాగింగ్ నిర్మూలనలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. అదే సమయంలో ఆత్మహత్యలు, ఒత్తిళ్లు జయించడం వంటి వాటిపై అవగాహన కల్పించే వారు. అలాగే 8 నుంచి 10 తరగతులకు చెందిన విద్యార్థులకు కౌమార విద్యపై అవగాహన కల్పించేవారు. ఈ పాఠాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అవగాహన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరుగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇంటి వద్దా తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయం తగ్గిపోతూ వస్తోం ది. ఫలితంగా యువతకు మార్గదర్శకం కనుమరుగైంది.
ఆ ప్రేమ కనిపించకేనా..?
ఈమె మీ అమ్మమ్మ, ఈయన మీ తాతయ్య, ఇది మన ఊరు.. ఇతడు మనవాడు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నాడు అని ప్రేమగా కబుర్లు చెప్పే తల్లిదండ్రులు ప్రస్తుతం తక్కువైపోతున్నారు. మార్కులు, ర్యాంకులు, కెరీర్, సంపాదన ఒత్తిడిలో పడి పిల్లలతో మాట్లాడే సమయం తగ్గించేస్తున్నారు. ఇదే సమయంలో తాము తమ పిల్లలకు అందివ్వాల్సిన ప్రేమానురాగాలను ఇవ్వడం మర్చిపోతున్నారు. అదే పిల్లలను వేరే ప్రేమ వెతుక్కునేలా చేస్తోంది.
ప్రేమికుల ఆత్మహత్యలు
జిల్లాలో గతంలో కంటే ఈ ఏడాది ప్రేమికుల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ ఏడాది ఆగస్టు 26న పొందూరు రైల్వే స్టేషన్ వద్ద పొందూరుకు చెందిన ఎ. మహాలక్ష్మి, రాజాం నగరపంచాయతీ పరిధి కొండంపేట గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌లు ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి తల్లిదండ్రులుకు తీవ్ర దుఖాన్ని మిగిల్చారు. ఈ నెల 2న పొందూరులోని కింతలి సమీపంలో కనిమెట్టకు చెందిన పవన్‌కళ్యాణ్, మొదలవలస గ్రామానికి చెందిన రేణుకలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు కింతలి జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. నిండా పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని వీరు తమ తొలి అడుగుల్లోనే మరణాన్ని వెతుకున్నారు. ఇలా చెప్పుకుంటే ఈ ఏడాది జిల్లాలో 14 ప్రేమికుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఎక్కువ మంది 22 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.
తల్లిదండ్రుల లోపం కూడా..
యుక్త వయస్సులోకి వస్తున్న యువతపై తల్లిదండ్రుల దృష్టి ఉండాలి. యువత పెడదోవ పట్టకుండా చూడాలి. వారికి తమ కుటుంబ జీవనం, భవిష్యత్‌లో సాధిం చాల్సిన మానవ దృక్పథాలను వివరించాలి. ప్రస్తుతం చాలా మంది యువత ఇంటి వద్ద ప్రేమను పొందలేకపోతున్నారు. ఆరుబయట ఆకర్షణకు గురవుతున్నారు. టీనేజీలోని ఈ ఆకర్షణను ప్రేమగా భావించుకుని అనర్థాల వైపు పరుగులెడుతున్నారు. – డాక్టర్ గార రవిప్రసాద్, రాజాం
వ్యక్తిత్వ వికాస తరగతులేవీ?
ప్రతి కళాశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు ఉండాలి. ఉన్నత స్థాయి పాఠశాలల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలతో కూడిన పాఠ్యాంశాలు ఉండాలి. అయితే ఇవి ప్రస్తుతం పాఠ్యాంశాల కరిక్యులమ్‌లో లేవు. దీంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కళాశాలల్లో కూడా ప్రముఖలతో యువతకు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఏర్పాటుచేయాలి. ఇంటి వద్ద కూడా సుద్దులు చెప్పే పెద్దవారు ఉంటే మానసిక పరిణితి పెరుగుతుంది. – వారాడ వంశీకృష్ణ, వ్యక్తిత్వ వికాసనిపుణులు, రాజాం.
Comments
Please login to add a commentAdd a comment