నేను చనిపోయినట్టు రాశారు: మహిళా ఎంపీ
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం వికీపీడియాపై లోక్ సభలో దుమారం రేగింది. వికీపీడియా చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ మహిళా ఎంపీ అంజుబాల ఆరోపించారు. తాను మరణించినట్లుగా రాసిన వికీ పీడియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అంజుబాలకు ప్రభుత్వం న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చింది. ఇది తీవ్రమైన చర్య అని, ఈ పరిస్థితి మరెవ్వరికీ కలగకుండా చూస్తామని వాగ్దానం చేసింది.
అంజుబాల ఈ విషయాన్ని జీరో అవర్ లో ప్రస్తావించారు. గతవారం తాను ఓ మహిళా సమావేశంలో పాల్గొన్న సమయంలో ముంబై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, అప్పుడే తనకు అసలు విషయం తెలిసిందని అన్నారు. మార్చి 3న తాను మరణించినట్లు వికీపీడియాలో పేర్కొంటూ వచ్చిన ఆ ఫోన్ కాల్ ను తన కార్యదర్శి రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. అంజుబాల మార్చి 3న చనిపోయినట్లుగా వికీపీడియాలో ఉందని కాల్ చేసిన వ్యక్తి చెప్పడంతో విస్తుపోయానన్నారు.
ఇటువంటి చర్యలు తన వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తాయని, చవకబారు అనుకరణలను చేస్తున్న వికీపీడియాపై చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఇటువంటి నేరాలపై ఎఫ్ఐఆర్ కూడ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనలు, నినాదాలమధ్య విషయాన్నిస్పీకర్ సుమిత్రా మహాజన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కచ్చితంగా ఓ తీవ్రమైన చర్య అని, ఈ విషయంలో తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని న్యాయశాఖామంత్రి డీవీ సదానంద గౌడ హామీ ఇచ్చారు.