భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి అరవింద్ భడోరియాకు కరోనా సోకింది. జలుబు, దగ్గు లాంటి కోవిడ్ లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే గురువారం భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుంబసభ్యులకు అందరికీ కరోనా నెగిటివ్ అని తేలింది. అయితే మంత్రి అరవింద్ భడోరియా ఒకరోజు ముందే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడంతో ఇప్పుడు మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. అంతకుముందు మంగళవారం గవర్నర్ లాల్జీ టాండన్ అంత్యక్రియల్లో కూడా అరవింద్ భడోరియా పాల్గొన్నారు. లాల్జీటాండన్ అంత్యక్రియల్లో, మంత్రివర్గ సమావేశంలో పలువురితో కలిసి పాల్గొన్న మంత్రికి కరోనా సోకడంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ ఆందోళన చెందుతున్నారు. (లాల్జీ టాండన్ కన్నుమూత )
ఇక రాజధాని భోపాల్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నందున జూలై 24 నుంచి పదిరోజుల పాటు భోపాల్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భోపాల్‌లోనే ఇప్పటివరకు 4,669 కరోనా కేసులు నమోదుకాగా, 144 మంది మరణించగా మధ్యప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకు 24,095 మందికి కరోనా వైరస్ సోకింది. 756 మంది కరోనాతో మరణించారు. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాలు మినహా మిగతా కార్యకలాపాలకు అనుమతి లేదని హోం మంత్రి నరోత్తం మిశ్రా ఓ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ దీనికి సహకరించాలని కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. (రాజ్‌భవన్‌లో 84 మంది సిబ్బందికి కరోనా )
Comments
Please login to add a commentAdd a comment