భోపాల్: కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైన సంగతి తెలిసిందే. వేవ్ మీద వేవ్ ముంచుకొస్తూ.. జనాలను, ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దుబారా ఎక్కడవుతుందో గమనిస్తూ.. కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహా.. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదేళ్ల పాటు సెలవులు ఇస్తూ.. సగం జీతం ఇవ్వడానికి నిర్ణయించారు అదికారులు.
ఖర్చు తగ్గించుకునే పనిలో భాగంగా ఈ వినూత్న పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు మధ్యప్రదేశ్ అధికారులు. ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఉద్యోగం చేయకపోయినా సగం జీతం తీసుకునే పథకం ఇది. మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా విధులకు హాజరు కాకుండా సగం జీతం తీసుకోవచ్చని చెబుతున్నారు. మిగతా సగం జీతాన్ని ప్రభుత్వం తన ఖాతాలో మిగుల్చుకుంటుంది. దీని వల్ల ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు.
ఈ పథకానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. ఇక ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే అమలులోకి వస్తుంది. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటున్నప్పటికి.. మన దేశంలో మాత్రం పనిలేకుండా సగం జీతం ఇవ్వడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు.
కరోనా వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయంది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. 30శాతం ఆదాయంలో కోతపడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించడం ఎలాగా అని తలలు పట్టుకున్నారు అధికారులు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఇప్పటికే 500కోట్ల రూపాయలు సమీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment