సాక్షి, చెన్నై : పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి షాక్ ఇచ్చే రీతిలో శుక్రవారం మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అధికార వార్‌లో తన పంతాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ నెగ్గించుకున్నారు. పుదుచ్చేరిలో ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయడానికి తగ్గట్టు కిరణ్ ఇచ్చిన ఉత్తర్వులకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి సైతం కిరణ్ అడ్డుకట్ట వేశారు. ఉచిత బియ్యంకు బదులుగా రేషన్ కార్డుదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేయాలని ఉత్తర్వుల్ని ఆమె జారీ చేశారు.
ఆమె ఉత్తర్వులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ఆమోద ముద్ర వేయడంతో, దీనిని అమలు చేయాల్సిన అవశ్యం నారాయణ సర్కారుకు ఏర్పడింది. ఉచిత బియ్యం పథకానికి తమ ప్రభుత్వ నిధుల్ని కేటాయించడం జరుగుతోందని, ఇందులో కేంద్రం జోక్యం తగదని ఇప్పటికే నారాయణ స్వామి స్పష్టం చేసి ఉన్నారు. అలాగే, కిరణ్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు సైతం సాగాయి. చివరకు ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గ్రీన్ సిగ్నల్..
ఈ ఉత్తర్వుల వ్యవహారం కోర్టుకు చేరడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఏడాదిన్నర కాలంగా ఉచిత బియ్యం పంపిణీ అన్నది ఆగిపోయింది. ఈ పిటిషన్ మీద శుక్రవారం తుది విచారణ న్యాయమూర్తి కార్తికేయన్ నేతృత్వంలోని బెంచ్ ముందు సాగింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అని, కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ ఇచ్చిన ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం సైతం లభించి ఉందని వాదించారు. నారాయణస్వామి ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు ఉచిత బియ్యం పంపిణీకి పట్టుబడుతూ వాదన వినిపించారు. రాష్ట్ర నిధుల్ని వెచ్చిస్తున్నప్పుడు, కేంద్రం జోక్యం ఏమిటో అని ప్రశ్నించారు. వాదనల అనంతరం నారాయణస్వామి సర్కారుకు షాక్ ఇచ్చే రీతిలో న్యాయమూర్తి ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment