మదురై బాలిక నేత్ర
సాక్షి, చెన్నై: సేవాతత్వం, మానవీయత వెరసి మదురై బాలిక నేత్రను అందలం ఎక్కించింది. తన తండ్రి మోహన్‌తో కలిసి లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న బాధితుల్ని ఆదుకున్న ఆ బాలిక సేవాతత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ బాలికలోని మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి తమ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. కరోనా కట్టికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పేదల్ని ఆదుకునే దిశగా ఎన్నో మావనతా హృదయాలు కదిలాయి. స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు సేవల్లో మునిగారు. మరెందరో వివిధ పనుల నిమిత్తం తాము దాచుకున్న సొమ్మును విరాళంగా అందించారు. ఈ పరిస్థితుల్లో మదురై మేలమడైకు చెందిన 9వ తరగతి విద్యార్ధిని నేత్ర(14) మంచి మనసు గురించి ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించారు. హెయిర్ కటింగ్ దుకాణం నడుపుతున్న నేత్ర తండ్రి మోహన్, కూతురు చదువుల కోసం దాచుకున్న రూ. 5 లక్షల్ని కష్టాల్లో ఉన్న పేదల సేవకు ఉపయోగించారని ప్రధాని వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా నేత్ర కుటుంబానికి అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా నేత్రకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అందింది.
ఐరాస అంబాసిడర్‌గా..
నేత్ర సేవ, మానవీయత ఎల్లలు దాటింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం ఆ బాలికకు వరంగా మారింది. ఆమె సేవ, మానవీయతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ అంబాసిడర్‌గా ప్రకటించింది. “గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’గా నేత్రను నియమిస్తూ శుక్రవారం ప్రకటన వెలువడింది. ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో జెనీవాలో జరగనున్న సమావేశంలో పేదరికం గురించి నేత్ర ప్రత్యేక ప్రసంగం ఇవ్వబోతున్నారు. అలాగే, ఆమె విద్యా ఖర్చులకు లక్ష రూపాయల ‘డిక్సన్ స్కాలర్‌షిప్’ను మంజూరు చేసింది. అరుదైన ఆహ్వానంసపై నేత్ర ఆనందం వ్యక్తం చేసింది.
మోదీ ప్రశంస, తాజాగా తనకు గౌరవం దక్కడం గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎంతో ఆనందంగా ఉందని, పేదరికం గురించి ఐరాస వేదిక మీద ప్రసంగించి అందర్నీ మన్ననలు పొందుతానని తెలిపారు. సేవా రంగంలో ముందుకు సాగాలన్న తన ఆకాంక్షకు ఐరాస ఆహ్వానం మరింత ప్రోత్సాహం ఇచ్చినట్టయిందని వ్యాఖ్యానించారు. ఒక్క భారత దేశంలోని పేదరికం గురించి మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాల్లోని పేదరికం గురించి తన ప్రసంగం ఉంటుందన్నారు. రెవెన్యూ మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ మాట్లాడుతూ.. ఇది తమిళనాడుకు ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. అందరికి నేత్ర ఆదర్శంగా నిలిచిందన్నారు. సేవాతత్వంతో ముందుకు సాగే వారికి ఇలాంటి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని నేత్ర చాటిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment