వారణాసిలో మోడీపై పోటికి మాఫియా డాన్!
కొద్ది రోజుల క్రితం వరకు వారణాసి ఓ పుణ్యక్షేత్రంగానే తెలిసి ఉండేది. కాని ఎన్నికల పుణ్యమా అని ప్రస్తుతం వారణాసి రాజకీయ రణక్షేత్రంగా మారనుంది. అందుకు కారణం బీజేపీ అభ్యర్థి వారణాసి ఎన్నికల బరిలో దిగడమే. ఇప్పటికే వారణాసి ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ ఉండగా, మోడీని ఓడించేందుకు మరో నేత రంగంలోకి దిగనున్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన మాఫియా డాన్ ముఖ్తర్ అన్సారీ వారణాసి ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నారు. ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన క్వామీ ఏక్తా దళ్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
2 లక్షల 50 వేల ముస్లీం ఓట్లు ఉన్న వారణాసి లోకసభ నియోజకవర్గంలో 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి ముచ్చెమటలు పట్టించారు. గత ఎన్నికల్లో 20 వేల ఓట్ల తేడాతో ముఖ్తర్ ఓటమి పాలైనారు. ప్రస్తుతం మావ్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు.