
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. వైరస్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి (63) ఆదివారం మృతిచెందారు. అలాగే బిహార్ రాజధాని పట్నాలో ఇటీవల ఖతర్ నుంచి వచ్చిన ఓ కరోనా బాధితుడు (38) మరణించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్రలో రెండో మరణం నమోదు కాగా, దేశంలో కరోనా మృతుల సంఖ్య 6కి చేరింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆదివారం నాటికి 74 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను మరింత అప్రమత్తం చేశారు. ఏ ఒక్కరినీ బయట తిరగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీచేశారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 285గా ఉన్న సంఖ్య ఆదివారం ఉదయం నాటికి 324కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. (ట్రంప్ గుడ్‌న్యూస్.. కరోనాకు విరుగుడు..!)
మహారాష్ట్ర(74), కేరళ (40), ఢిల్లీ (26), ఉత్తరప్రదేశ్ (24), తెలంగాణ (21)లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతుగా కృషి చేస్తున్నారు. ప్రజలు జనతా కర్ఫ్యూలో భాగం కావడంతో.. దేశ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వాహనాలు, రైళ్లను రద్దు చేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. (పారాసిట్‌మాల్‌తో అద్భుత ఫలితం)
Comments
Please login to add a commentAdd a comment