ముంబై : మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా జూలై 31వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అంక్షల అమలు విషయంలో జిల్లా కలెక్టర్లకు, మున్సిపల్ కమిషనర్లకు అధికారాలు ఇచ్చింది. ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం మినహాయింపుల ఇవ్వాలని సూచించింది. కాగా, ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మరోసారి లాక్‌డౌన్ ప్రకటించాల్సి వస్తుందని ఆదివారం రోజున మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 5.48 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కేవలం మహారాష్ట్రలోనే 1,64,626 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 86,575 మంది డిశ్చార్జి కాగా, 7,429 మంది మృతిచెందారు. ప్రస్తుతం 70,622 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరగడంతో ఇప్పటికే పలు నగరాల్లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment