ఐపీఎస్ అధికారిపై అత్యాచారం కేసు నమోదు
పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసి.. ఆమెపై అత్యాచారం చేసినందుకు మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిపై కేసు నమోదైంది. బాధితురాలు యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకున్న ఓ అభ్యర్థిని కావడం గమనార్హం. 2013 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి లోహిత్ మతానీ తనపై ఈ సంవత్సరం ఆగస్టు నెలలో టుకోగంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసిందని జిల్లా ఎస్పీ ఓపీ త్రిపాఠీ తెలిపారు.
ఆ తర్వాత కూడా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి పలు ప్రాంతాల్లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఎక్కడకు వెళ్లినా ఆమె తన భార్య అనో, కాబోయే భార్య అనో చెప్పేవాడు. కానీ, ఆ తర్వాత మాత్రం ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించాడు. యూపీఎస్సీ పరీక్షలు రాయాలనుకుంటూ ప్రిపేర్ అయ్యే సమయంలో ఫేస్‌బుక్ ద్వారా మతానీతో బాధితురాలికి పరిచయం అయ్యింది. పరీక్షల ప్రిపరేషన్‌కు సహకరిస్తానని చెప్పి ఆమెను అతడు లొంగదీసుకున్నాడు. దీంతో ఐపీఎస్ అధికారి మతానీపై 376 (అత్యాచారం), 417 (మోసం) సెక్షన్ల కింద కేసులు పెట్టారు.