మహారాష్ట్ర మంత్రికి క్షీరాభిషేకం
ముంబై: సొంత పార్టీ కార్యకర్త నుంచి సిరా దాడిని ఎదుర్కొన్న మహారాష్ట్ర కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్‌కు ఎన్సీపీ కార్యకర్తలు క్షీరాభిషేకంతో ‘శుద్ధి’ చేశారు. ఈ సంఘటన కొల్హాపూర్‌లో శుక్రవారం జరిగింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా చట్టం తెచ్చిన మహారాష్ట్రలో ఈ సంఘటన జరగడం ఆశ్చర్యకరం. సిరా దాడి తర్వాత మంత్రికి క్షీరాభిషేకంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి ముష్రిఫ్ తన మద్దతుదారుల చర్యకు ఆదివారం క్షమాపణలు చెప్పుకున్నారు. వారేం చేయబోయేదీ ముందుగానే తనకు తెలిసి ఉంటే వారించేవాడినని ఆయన అన్నారు.
బుల్ధానా ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి మంత్రి ముష్రిఫ్ హాజరయ్యారు. సభా వేదిక వద్దకు ఆయన వెళుతుండగా, నామ్‌దేవ్ డోంగార్దివే అనే కార్యకర్త అకస్మాత్తుగా ఆయనపై సిరా చల్లాడు. మిగిలిన కార్యకర్తలు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. సంఘటన జరిగిన మర్నాడు మంత్రి ముష్రిఫ్ కొల్హాపూర్‌లో ఏర్పాటైన కార్యకర్తల సమావేశానికి హాజరు కాగా, ఆయన మద్దతుదారులు ఆయనను ఒక కుర్చీలో ప్రత్యేకంగా కూర్చోబెట్టి, క్షీరాభిషేకం చేశారు.