hasan mushrif
-
వితంతువులపై గ్రామ పంచాయితీ సంచలన తీర్మానం.. దేశంలోనే తొలి గ్రామంగా
ముంబై: భర్త చనిపోయిన వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధవరాళ్లకు చేసే ఆచారాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించే హక్కును కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వితంతు తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వితంతు మహిళల పట్ల తిరోగమన ఆచారాలకు వ్యతిరేకంగా ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామంలో ఈనెల 4న చేసిన తీర్మానానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇదేవిధమైన తీర్మానాలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హెర్వాడ్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. వింతతు మహిళల పట్ల చేసే ఆచార వ్యవహారాలైన గాజుల విరగ్గొట్టడం, వాటిని తీసివేయడం, మరెప్పుడూ ధరించకుండా నిషేధించడం, బొట్టు (సింధూరాన్ని) తీసివేయడం, మంగళసూత్రాన్ని తెంచివేయడం, కాలి మెట్టెల్ని తీసివేయడం వంటి ఆచారాల్ని ఇకపై పాటించకుండా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీర్మానించింది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, మతపరమైన వేడుకలు, సామూహిక వేడుకల్లో పాల్గొనకూడదనే సంప్రదాయాన్ని హెర్వాడ్ పంచాయతీ తీర్మానంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇకపై అటువంటి ఆచారాలను వితంతు మహిళలెవరూ గ్రామంలో ఎవరూ పాటించనవసరంలేదని తేల్చిచెప్పింది. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ తీర్మానం ఈ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వితంతు మహిళలు మరింత గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతో పాటుగా ఇతర గ్రామ పంచాయతీలకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వెనుక షోలాపూర్ జిల్లాలలోని సంఘ సంస్కర్త మహాత్మ పూలే సామాజిక సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధి ప్రమోద్ జింజాడే చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...వితంతు మహిళలు గౌరవంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తొలి గ్రామంగా దేశ చరిత్రలోనే హెర్వాడ్ గ్రామం నిలిచిందని జింజాడే పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని మరో ఏడు గ్రామ పంచాయతీలు అనుసరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇటువంటి తీర్మానాలు కూడా దురాచారాలను రూపుమాపలేవని, వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయడమే సమస్యకు అసలు పరిష్కారమని ఆయన తెలిపారు. దీనిపై చట్టాన్ని చేసేందుకు మండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గొర్హెతో సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలోని రెండు సభల్లోనూ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో చర్చకు పెట్టేలా చూస్తాననని ఆమె హామీనిచ్చినట్లు ప్రమోద్ జింజాడే తెలిపారు. చదవండి: రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని.. అయితే ఈ విషయానికి సంబంధించి కొత్త చట్టం చేయాలా లేదా పాత చట్టాల ద్వారానే అమలు చేయవచ్చా అనే అంశాన్ని న్యాయ విభాగం ఒకసారి పరిశీలించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వితంతు మహిళలపట్ల ఈ విధమైన దురాచారాలకు పాల్పడే గ్రామస్తులు, బయటవారిపై ఏడాది పాటు జైలు శిక్షను, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ప్రమోద్ జింజాడే మండలి డిప్యూటీ చైర్మన్ గొర్హెకు ప్రతిపాదించారు. అదే బంధువులైతే 15 రోజుల నుంచి నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.50వేలకు వరకు జరిమానా విధించా లని ఆయన ప్రతిపాదించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ కమిటీలో 50 శాతం మహిళలే ఉండాలని, అందులో సగంమంది వితంతువులు ఉండాలని పేర్కొన్నారు. -
జాదవ్‌కు కార్మికశాఖ
సాక్షి, ముంబై: కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన భాస్కర్ జాదవ్‌కు కార్మికశాఖను అప్పగించారు. జాదవ్‌కు అప్పగిస్తారని భావించిన జలవనరులశాఖ హసన్ ముష్రిఫ్‌కు కట్టబెట్టారు. ఎన్సీపీ పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా సునీల్ తట్కరేను నియమించడంతో అప్పటిదాకా ఆ స్థానంలో కొనసాగిన భాస్కర్ జాదవ్ కు మంత్రిమండలిలో స్థానం కల్పించారు. అయితే సునీల్ తట్కరే నిర్వహించిన జలవనరులశాఖ బాధ్యతలను జాదవ్‌కు అప్పగించనున్నారని ఆ పార్టీ నేతలు గురువారం చెప్పినా అధిష్టానం మాత్రం హసన్ ముష్రిఫ్ నిర్వహిస్తున్న కార్మికశాఖను అప్పగించింది. తట్కరేకు రాష్ట్రాధ ్యక్ష పదవి దక్కడంతో ఖాళీ అయిన జలవనరుల మంత్రిత్వశాఖను హసన్ ముష్రిఫ్‌కు అప్పగించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ ఈ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్సీపీలో జరుగుతున్న మార్పులపై కాంగ్రెస్ ఓ కన్నేసింది. ఆ పార్టీ చేస్తున్న మార్పులకు అనుగుణంగానే తమ పార్టీలో కూడా మార్పులు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఎన్నికల ప్రకటన వెలువడేనాటికి రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వశాఖలో ఏ మంత్రి కొనసాగుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీనిపై పార్టీ నేతల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే విశ్లేషకులు మాత్రం ఈ మార్పులు సత్ఫలితాలను ఇవ్వలేవని, ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయలేరని చెబుతున్నారు. -
మహారాష్ట్ర మంత్రికి క్షీరాభిషేకం
ముంబై: సొంత పార్టీ కార్యకర్త నుంచి సిరా దాడిని ఎదుర్కొన్న మహారాష్ట్ర కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్‌కు ఎన్సీపీ కార్యకర్తలు క్షీరాభిషేకంతో ‘శుద్ధి’ చేశారు. ఈ సంఘటన కొల్హాపూర్‌లో శుక్రవారం జరిగింది. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా దేశంలోనే తొలిసారిగా చట్టం తెచ్చిన మహారాష్ట్రలో ఈ సంఘటన జరగడం ఆశ్చర్యకరం. సిరా దాడి తర్వాత మంత్రికి క్షీరాభిషేకంపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి ముష్రిఫ్ తన మద్దతుదారుల చర్యకు ఆదివారం క్షమాపణలు చెప్పుకున్నారు. వారేం చేయబోయేదీ ముందుగానే తనకు తెలిసి ఉంటే వారించేవాడినని ఆయన అన్నారు. బుల్ధానా ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి మంత్రి ముష్రిఫ్ హాజరయ్యారు. సభా వేదిక వద్దకు ఆయన వెళుతుండగా, నామ్‌దేవ్ డోంగార్దివే అనే కార్యకర్త అకస్మాత్తుగా ఆయనపై సిరా చల్లాడు. మిగిలిన కార్యకర్తలు అతడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. సంఘటన జరిగిన మర్నాడు మంత్రి ముష్రిఫ్ కొల్హాపూర్‌లో ఏర్పాటైన కార్యకర్తల సమావేశానికి హాజరు కాగా, ఆయన మద్దతుదారులు ఆయనను ఒక కుర్చీలో ప్రత్యేకంగా కూర్చోబెట్టి, క్షీరాభిషేకం చేశారు. -
రాత్రి 10 గంటల వరకు షాపులు!
సాక్షి, ముంబై: నగరంలోని దుకాణదారులు ఇక మీదట కొత్త సమయ వేళలను పాటించనున్నారు. ప్రస్తుతం నగరంలోని దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 గంటలకే తమ దుకాణాలను బంద్ చేసేవారు. ఇక మీదట వీరు రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు. నగర దుకాణాలు, సంస్థల యాక్టును సవరించి రాత్రి 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయాన్ని పెంచారని దుకాణ దారులు పేర్కొన్నారు. తమ ప్రతిపాదనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమ్మతించి, మంజూరు చేశారని వారు తెలిపారు. దీంతో ఇక మీదట తాము దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచుకోవచ్చని వారు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై తాము ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశామని కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా 18.5 లక్షల దుకాణాలు, సంస్థలు ఉన్నాయన్నారు. దుకాణాలను మూసి ఉంచే సమయాన్ని రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించేందుకు చట్ట సవరణ నిమిత్తం 2011 అక్టోబర్ 20న రాష్ర్ట ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. ఈ ప్రతిపాదనను ఇరు సభలు అనుమతినిచ్చాయన్నారు. తర్వాత దానిని రాష్ట్రపతి అనుమతి కోసం సమర్పించగా వారం కిందటే వారినుంచి ఆమోదముద్ర లభించిందని ముష్రిఫ్ పేర్కొన్నారు. కాగా, దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 వరకు మూసి ఉంచాలని 1948లోనే చట్టం చేశారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును రాత్రి 10 గంటల వరకు మార్చాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముంబై లాంటి మహానగరాల్లో నగరవాసులు మామూలుగా రాత్రి 9 గంటల కంటే ముందు ఇంటికి చేరుకోరన్నారు. అయితే దుకాణాలు రాత్రి 8.30 మూసి ఉంచడంతో వీరికి రోజువారీ సరుకులు కొనుగోలు చేయాలన్నా కష్టంగా మారుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సమయాన్ని మరింత పొడిగించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి కూడా సహాయకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు గడువును పొడిగించే ప్రతిపాదనను ఒక దశాబ్దం తర్వాత పరిగణనలోకి తీసుకున్నారన్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓ పక్క నగరాన్ని అంతర్జాతీయ క్షేత్రంగా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆసక్తి చూపిస్తూ, మరో పక్క హాస్యాస్పద నిబంధనలు విధిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.