రాత్రి 10 గంటల వరకు షాపులు! | President gave permission to run stores up to 10 hours at night | Sakshi
Sakshi News home page

రాత్రి 10 గంటల వరకు షాపులు!

Published Sat, Nov 16 2013 11:24 PM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

President gave permission to run stores up to 10 hours at night

సాక్షి, ముంబై:  నగరంలోని దుకాణదారులు ఇక మీదట కొత్త సమయ వేళలను పాటించనున్నారు. ప్రస్తుతం నగరంలోని దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 గంటలకే తమ దుకాణాలను బంద్ చేసేవారు. ఇక మీదట వీరు రాత్రి 10 గంటల వరకు కొనసాగించవచ్చు. నగర దుకాణాలు, సంస్థల యాక్టును సవరించి రాత్రి 8.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సమయాన్ని పెంచారని దుకాణ దారులు పేర్కొన్నారు. తమ ప్రతిపాదనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమ్మతించి, మంజూరు చేశారని వారు తెలిపారు. దీంతో ఇక మీదట తాము దుకాణాలను రాత్రి 10 గంటల వరకు తెరచి ఉంచుకోవచ్చని వారు ఆనందం వ్యక్తం చేశారు.
 కాగా, దీనిపై తాము ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేశామని కార్మిక మంత్రి హసన్ ముష్రిఫ్ పేర్కొన్నారు. నగరవ్యాప్తంగా 18.5 లక్షల దుకాణాలు, సంస్థలు ఉన్నాయన్నారు. దుకాణాలను మూసి ఉంచే సమయాన్ని రాత్రి 8.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించేందుకు చట్ట సవరణ నిమిత్తం 2011 అక్టోబర్ 20న రాష్ర్ట ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. ఈ ప్రతిపాదనను ఇరు సభలు అనుమతినిచ్చాయన్నారు. తర్వాత దానిని రాష్ట్రపతి అనుమతి కోసం సమర్పించగా వారం కిందటే వారినుంచి ఆమోదముద్ర లభించిందని ముష్రిఫ్ పేర్కొన్నారు.
 కాగా, దుకాణాలు, సంస్థలు రాత్రి 8.30 వరకు మూసి ఉంచాలని 1948లోనే చట్టం చేశారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును రాత్రి 10 గంటల వరకు మార్చాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ముంబై లాంటి మహానగరాల్లో నగరవాసులు మామూలుగా రాత్రి 9 గంటల కంటే ముందు ఇంటికి చేరుకోరన్నారు. అయితే దుకాణాలు రాత్రి 8.30 మూసి ఉంచడంతో వీరికి రోజువారీ సరుకులు కొనుగోలు చేయాలన్నా కష్టంగా మారుతోందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సమయాన్ని మరింత పొడిగించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి కూడా సహాయకరంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 ఈ సందర్భంగా సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు గడువును పొడిగించే ప్రతిపాదనను ఒక దశాబ్దం తర్వాత పరిగణనలోకి తీసుకున్నారన్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అంతేకాకుండా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఓ పక్క నగరాన్ని అంతర్జాతీయ క్షేత్రంగా, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆసక్తి చూపిస్తూ, మరో పక్క హాస్యాస్పద నిబంధనలు విధిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement