అక్బరుద్దీన్ రాకపై నిషేధం
సాక్షి, ముంబై: ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులు ఠాణేలో నిర్వహించే సమావేశంలో పాల్గొనకుండా నిషేధించారు. ముంబ్రాలో జరిగే సమావేశంలో బుధవారం ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే శాంతిభద్రతల దృష్ట్యా ఆయనకు ప్రవేశం నిరాకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయమై ఈ నెల 20న ఒవైసీకి నోటీసు పంపించారు. గతంలో ఆయన మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగించినందున ఠాణేలోకి అనుమతించడానికి పోలీసులు అంగీకరించడం లేదు.
ఈ నోటీసు ప్రకారం అక్బరుద్దీన్‌కు జులై 20 నుంచి జులై 31 వరకు ఠాణేలో ప్రవేశించడాన్ని నిషేధించారు. దీనిపై స్పందించిన ఎంఐంఎం పోలీసుల నోటీసుకు సమాధానం చెబుతామని పేర్కొంది. తాము నోటీసులో పేర్కొన్నట్టు సమావేశాలకు వెళ్లడం లేదని, ఇఫ్తార్ విందుకు మాత్రమే హాజరవుతున్నట్టు ఒవైసీ వివరణ ఇచ్చారు. ఈ నోటీసును ఎంఐఎం కోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది.
రాష్ట్రంలో విస్తరణకు ప్రయత్నాలు....
మహారాష్ట్రలో పార్టీని విస్తరించేందుకు ‘మజ్లిస్-ఎ-ఇత్తహాదల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరాఠ్వాడాలోని ఎనిమిది జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఇప్పటికే ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి మహారాష్ట్రలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత సంవత్సరం నాందేడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏకంగా 11 స్థానాలను గెలుచుకుంది.
ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. మరాఠ్వాడా జనాభాలో 25 శాతం మంది ముస్లింలే కావడంతో ఈ ప్రాంతంపై ఎంఐఎం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటర్ల సంఖ్య 40 శాతం వరకు ఉంది. ఎన్నికల పొత్తుల కోసం కొన్ని పార్టీలతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.
కాంగ్రెస్, ఎస్పీలకు నష్టం...?
మైనారిటీ ఓట్లను నమ్ముకున్న కాంగ్రెస్, ఎస్పీకి రాష్ట్రంలో ఎంఐఎం బలపడితే కొంతమేర నష్టం వాటిల్లుతుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్‌కు కీలకమైన ఓటు బ్యాంకుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మైనారిటీ ఓటర్లపై సమాజ్‌వాదీ పార్టీ కొంతమేర ప్రభావం చూపింది.
దీంతో కొందరు ఎస్పీ వైపు ఆకర్షితులయ్యారని చెప్పవచ్చు. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగితే మైనారిటీల్లో కొందరు ఈ పార్టీవైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఫలితంగా కాంగ్రెస్, ఎస్పీ చాలా ఓట్లు నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి.