శివసేన వైపు బీజేపీ చూపు
‘మహా’ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోసం సంకేతాలు
ఎన్సీపీ మద్దతు ప్రతిపాదననూ తోసిపుచ్చని కమలనాథులు
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ ఒకప్పటి తన మిత్రపక్షమైన శివసేన మద్దతు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే శివసేనతో డీల్ కుదరకపోతే ఎన్సీపీ బయటి నుంచి ఇచ్చే మద్దతును తీసుకునే అవకాశాన్నీ తెరచే ఉంచుకుంది. శివసేన తమ సహజ మిత్రపక్షమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శివసేన కూడా కాషాయదళంతో చర్చలకు సిద్ధమైంది. బీజేపీ నాయకులతో చర్చించడానికి సేన నేతలైన రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్, సుభాష్ దేశాయ్‌లు మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరోపక్క.. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నికను పరిశీలించేందుకు జేపీ నడ్డాతోపాటు నియమితులైన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ముంబై పర్యటనను మంగళవారం మళ్లీ వాయిదా వేసుకున్నారు. దీపావళి తర్వాత ముంబై వెళ్తానన్నారు. శివసేన మద్దతు కోసం వేచిచూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సేనతో తెరవెనక చర్చలు సాగుతున్నట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. శివసేనతో తిరిగి దోస్తీకి బీజేపీ సిద్ధమని అరుణ్ జైట్లీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది. మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాలను అభినందిస్తూ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వారికి ఫోన్ చేయడాన్ని జైట్లీ ప్రస్తావించారు. ఇది తిరిగి చేతులు కలపడానికి సంకేతమన్నారు.
‘మా ముందు 2 ప్రతిపాదనలు ఉన్నాయి. సేన మా సహజ మిత్రుడు. ఎన్సీపీ బేషరతు మద్దతిస్తామంది. మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, సేనలు ఉండే అవకాశముంది, ఇందులో సమస్య తలెత్తితే ఎన్సీపీ ప్రతిపాదనా ఉంది’ అని అన్నారు. ఎన్సీపీతో పొత్తు అవకాశాన్ని తోసిపుచ్చుతున్నారా? అని అడగ్గా, రాజకీయాల్లో దేన్నీ తోసిపుచ్చలేమన్నారు. సేన తిరిగి తమతో చేతులు కలిపితే సంతోషిస్తామని మహారాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి ఓం ప్రకాశ్ మాథుర్ అన్నారు. సేన బెట్టువీడకపోతే తన శాసనసభాపక్ష నేతను ఎన్నుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఎన్సీపీ మద్దతుతో బలం నిరూపించుకుంటామని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. బీజేపీ నేతలు 18 మంది స్వతంత్ర, చిన్నపార్టీల ఎమ్మెల్యేల్లో 12 మందిని సంప్రదించారు. మొత్తానికి దీపావళి తర్వాతే ప్రభుత్వం ఏర్పడనుంది. సీఎం పదవి రేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ ముందంజలో కొనసాగుతుండడం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని సీఎంను చేయాలని రాష్ర్ట బీజేపీ సీనియర్ నేత విలాస్ ముంగంతివార్ అన్నారు. మరోపక్క.. గడ్కారీ మంగళవారం ఢిల్లీలో అరుణ్ జైట్లీని కలసి మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేల్లో 165 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో బీజేపీ నుంచి 74 మంది, శివసేన నుంచి 48 మంది, కాంగ్రెస్ నుంచి 15మంది ఉన్నట్లు మహారాష్ట్ర ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.