సత్యం, అహింస ఆయుధాలుగా దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాత్ముడిని దేశం మొత్తం స్మరించుకుంటోంది. నాజీవితమే నా సందేశం అంటూ ఎలుగెత్తి చాటిన ఆ మహనీయుడు స్మృతుల్లో సకల భారతావని తేలిపోతోంది. తరతరాలకు ఆదర్శప్రాయుడైన గాంధీని అనుసరిద్దాం అంటూ ఎలుగెత్తి చాటుతోంది.
.......
భరతమాత స్వేచ్ఛ కోసం జీవితాంతం తపన పడిన ఆ గుండె చప్పుడుని ఇప్పుడు మనమూ వినొచ్చు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలోని నేషనల్ గాంధీ మ్యూజియంలో ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. అందులో గాంధీ గుండె చప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గాంధీజీ జీవితంలో వివిధ దశల్లో తీసిన ఈసీజీలను సేకరించి వాటికి అనుగుణంగా డిజిటల్ పద్ధతుత్లో గుండె చప్పుడుని కృత్రిమంగా సృష్టించారు.
ఈ గుండె చప్పుడు సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుందని మ్యూజియం డైరెక్టర్ ఎ. అన్నామలై తెలిపారు. అహింసా, ప్రపంచ శాంతి అన్న థీమ్‌తో ఒక ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అంతే కాదు మహాత్ముడికి చెందిన అరుదైన సేకరణలతో డిజిటల్ మల్టీమీడియా కిట్‌ను రూపొందించారు. ఒక పెన్ డ్రైవ్‌లో ఉండే ఈ కిట్‌లో గాంధీజీ రచించిన 20 పుస్తకాలు, మహాత్ముడిపై వచ్చిన 10 పుస్తకాలు, గాంధీజీపై ఎకే చెట్టియార్ తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్, మహాత్ముని జీవిత విశేషాల్ని తెలిపే 100 అరుదైన చిత్రాలు, గాంధీజీ ప్రసంగాలు, గాంధీజీ ఆశ్రమంలో టూర్, ఆయనకు ఇష్టమైన భజనలు ఆ కిట్‌లో ఉంటాయి. ఈ కిట్‌ను రూ.300లకు సందర్శకులు కొనుక్కోవచ్చు.
నెదర్లాండ్స్‌లో గాంధీ మార్చ్
అక్టోబర్ 2, గాంధీ మహాత్ముడి జయంతే కాదు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం కూడా. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు సంబరాలు చేసుకున్నాయి. ఈ సారి మహాత్ముడి 150వ జయంతి కావడంతో నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో వెయ్యి మందితో గాంధీ మార్చ్ జరిగింది. ఇందులో వివి«ధ దేశాలకు చెందిన 20 మంది రాయబారులు కూడా పాల్గొన్నారు. వీరంతా మహాత్ముడిని అనుసరిద్దాం అన్న లోగో ప్రింట్ చేసిన టీ షర్ట్‌లు ధరించారు. నెదర్లాండ్స్‌లో భారత రాయబారి రాజమణి ఈ మార్చ్‌కు నేతృత్వం వహించారు.
మార్పు కోసం 150 ఆలోచనలు
బాపూజీ ఆదర్శాలే స్ఫూర్తిగా సమాజంలో మార్పు కోసం 150 ఐడియాలు ఇవ్వండి అంటూ లెటర్‌ఫారమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రచారాన్ని ప్రారంభించింది. సమాజంలో మార్పుకోసం తమకు వచ్చిన ఆలోచనల్ని పోస్టుకార్డుపై రాసి పంపండి అంటూ ఆ స్వచ్ఛంద సంస్థ యువతకి పిలుపునిచ్చింది. వచ్చే ఏడాదిలోగా యువత నుంచి వచ్చిన వాటిలో అత్యుత్తమమైన 150 ఆలోచనల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకొని దేశాభివృద్ధి కోసం ఏం చేయవచ్చో సమగ్ర చర్చ జరుపుతామని లెటర్‌ఫారమ్స్ స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుడు సాటి మాథ్యూ వెల్లడించారు. యువత తమకు వచ్చిన ఆలోచనని ఛేంజ్150, లెటర్‌ఫారమ్స్, పోస్టుబ్యాగ్‌నెం.1683, కొచ్చి, కేరళ అన్న చిరునామాకు పంపించవచ్చు.
ముంబైలో కళాకారుల ప్రదర్శన
దక్షిణ ముంబైలోని ప్రతిష్టాత్మక సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (ఎస్‌జేజేఎస్‌ఏ) మహాత్ముడి కోసం ప్రత్యేకంగా కళాకారుల ప్రదర్శన ఏర్పాటుచేసింది. మహారాష్ట్రవ్యాప్తంగా 150 మంది కళాకారులు వివిధ కళారూపాల్లో గాంధీజీకి నివాళులర్పించనున్నారు. చిత్రకారులు, శిల్పకళాకారులు, చేనేత కళాకారులు రకరకాల ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని రంజింపజేయనున్నారు. డ
ఒడిశాలో రెండేళ్లపాటు ఉత్సవాలు
ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం గాంధీజీ 150 జయంతి ఉత్సవాలను రెండేళ్లపాటు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ గాంధీజీ సిద్ధాంతాలు తెలిసేలా, గాంధీని అనుసరించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు 2020 అక్టోబర్ 2వరకు కొనసాగనున్నాయి.
ట్విట్టర్‌లో గాంధీజీ ఇమోజీ
మహాత్మా గాంధీ 150 జయంతిని సందర్భంగా ట్విట్టర్ మంగళవారం గాంధీజీ ఇమోజీని ఆవిష్కరించనుంది. ఈ ఇమోజీ వారం రోజుల పాటు నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా ఎవరైనా ట్వీట్‌లు చేస్తే గాంధీ జయంతి హ్యాష్‌ట్యాగ్‌లతో పాటుగా గాంధీ ఇమోజీని కూడా వినియోగించవచ్చు. దీంతో పాటుగా మహాత్ముడి క్యారికేచర్ కూడా నీలం తెలుపు రంగుల్లో ట్విట్టర్ బ్యాక్ డ్రాప్‌లో మెరిసిపోనుంది. ట్విట్టర్ అధికారిక లోగో థీమ్‌లో భాగంగా ఈ కేరికేచర్ దర్శనమివ్వబోతోంది.
గాంధీజీ స్కూలు.. ఇక ‘చరిత్ర’నేనా..!
జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం దేశవ్యాప్తంగా అట్టహాసంగా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ అప్రియ సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లో గాంధీజీ స్థాపించిన ‘రాష్ట్రీయ శాల’ స్కూలు నిర్వహణ కుæ నిధులు కొరవడడంతో రెండు నెలల క్రితం మూతపడింది. 97 ఏళ్ల నాటి ఈ పాఠశాలలో 1–7 తరగతుల మధ్య చదువుకుంటున్న 37 మంది విద్యార్థులు ఇప్పుడు మరో స్కూళ్లో చేరాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి మ్యూజియంగా మార్చిన ఆల్ఫ్రేడ్ హైస్కూల్‌ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఈ మ్యూజియంకు కేవలం 2 కి.మీ దూరంలోనే ఈ పాఠశాల ఉనికి కోల్పోయింది. 1921 ఫిబ్రవరి 1న ప్రారంభించిన ఈ స్కూల్ నియామవళిని గాంధీజీనే రూపొందించారు. జాతి నిర్మాణానికి సంబంధించి ఆదర్శాలను పిల్లల్లో ప్రోదిగొల్పేలా చేయాలన్నదే వీటి లక్ష్యం. ఈ పాఠశాలలోనే గాంధీజీ తరచుగా ప్రార్థన చేయడంతో పాటు , స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా 1939లో ఇక్కడే నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ నగరంలోనే ఓ ఉత్తమ పాఠశాలగా ఇది విరాజిల్లింది. ప్రస్తుత గుజరాత్ విద్యాపీ uŠ‡ వైస్‌ఛాన్సలర్ అనామిక్ షా తో సహా పలువురు ప్రముఖుడు ఇక్కడే చదువుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగొచ్చాక గాంధీజీ అప్పుడున్న విద్యావిధానాన్ని తక్షణం మార్చాల్సిన అవసరాన్ని గుర్తించారు.
దీనిద్వారానే ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి సిద్ధం చేయగలమనే అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలకు ప్రతిరూపంగానే ‘రాష్ట్రీయ శాల’ రూపుదిద్దుకుంది. యువతకు మాతృభాషలోనే విద్యాబోధన అందాలని. ఆ విధంగా విద్యను అందించగలిగితే దేశంతో పాటు కష్టాల్లో ఉన్నవారికి సేవ చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆయన నమ్మారు. ఈ స్కూలును నడుపుతున్న రాష్ట్రీయ శాలట్రస్ట్ నిధుల కోసం బుక్‌లెట్ల ద్వారా ప్రజలకు విజ్ఞప్తిచేసింది. ఈ చారిత్రక విద్యాసంస్థ పరిరక్షణ కోసం విరాళాలివ్వాల్సిందిగా ప్రజలు, కార్పొరేట్ల సహాయం కూడా కోరింది. అయితే స్కూల్‌ను నడిపేందుకు ఏడాదికి రూ.8.3 లక్షలు కావాలని, ఆ మేర నిధులు లేకపోవడంతో గత్యంతరం లేక దీనిని మూసేస్తున్నట్టు మేనేజింగ్ ట్రస్టీ, పాఠశాల ప్రధాన కార్యదర్శి జీతూ భట్ తెలిపారు.
టాల్‌స్టాయ్ మెచ్చిన గాంధీ
రష్యా ప్రఖ్యాత నవలాకారుడు లియో టాల్‌స్టాయ్ తన జీవిత చరమాంకంలో ఆఖరి ఉత్తరాన్ని ఎవరికి రాశారో తెలుసా? మన గాంధీజీయే. తనకంటే వయసులో 40 ఏళ్లు చిన్న అయినప్పటికీ తమ్ముడూ, మిత్రమా అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ తన ఆలోచనల్ని పంచుకున్నారు. 1910లో తన 82 ఏళ్ల వయసులో మరణించడానికి సరిగ్గా రెండు నెలల ముందు టాల్‌స్టాయ్ గాంధీజీకి రాసిన లేఖ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలోనూ, భారత్‌లోనూ లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. ‘నేను సంపూర్ణ జీవితాన్ని అనుభవించాను. మరణం నా వెనుకే పొంచి ఉందని నాకు తెలుస్తోంది. అందుకే నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెబుతున్నాను. దుర్మార్గుల్ని నిరోధించాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రపంచంలో మిమ్మల్నెవరూ బానిసలుగా మార్చలేరు‘ అంటూ ఆ లేఖలో రాశారు. అహింసా మార్గంలో గాంధీజీ చేస్తున్న పోరాటాన్ని కూడా టాల్‌స్టాయ్ అభినందించారు. మీ మార్గం అనితరసాధ్యం, ప్రపంచానికే అది అనుసరణీయం అంటూ గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. గాంధీజీ కూడా టాల్‌స్టాయ్‌ను అంతకు అంతా అభిమానించారు.
మహాత్మా మన్నించు!
ఆ రోజు జాతిపిత మహాత్మా గాంధీకి తెలియదు..
తన మాటకు భవిష్యత్తు పాలకులు తిలోదకాలిస్తారని..!
నేనున్నానంటూ ఇచ్చిన భరోసా వట్టిమాట అవుతుందని..!
గాంధీజీ పేరుతో రాజకీయాలు చేసే ప్రభుత్వాలు ఆయన ఆశయాలకు తిలోదకాలిస్తున్నాయని చెప్పే వాస్తవగాథ ఇది. గాంధీజీ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పేందుకు నిదర్శనం ‘ఘసెరా’ గ్రామం! దేశ రాజధాని ఢిల్లీకి కేవలం దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘసెరాలో మియో ముస్లింలు అధికంగా నివసిస్తున్నారు. దేశ స్వాతంత్య్రం, విభజన తర్వాత నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో మహాత్మా గాంధీజీ ఘసెరాను సందర్శించి గ్రామ ప్రజలు పాకిస్థాన్‌కు వెళ్లొద్దని, భారతదేశంలోనే ఉండాలని కోరారు. గ్రామ ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన ఎంతో చొరవచూపిన కారణంగా గ్రామానికి ‘గాంధీ గ్రామ్ ఘసెరా’ అని పేరొచ్చింది. అయితే గాంధీజీ మాటపై గౌరవంతో ఘసెరాలో స్థిరపడిపోయిన స్థానిక ప్రజలు తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక అవసరాలైన గృహ, తాగునీరు, రోడ్లు, విద్య, పారిశుధ్యం వంటి కనీస వసతులకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి బతుకు మాత్రం మారట్లేదు.
భూత్ బంగ్లా కాదు..గరీబోడి ఇల్లు..
నాటి మహాత్ముడి ప్రసంగ వేదిక ఇదే...
Comments
Please login to add a commentAdd a comment