‘‘పరుల బాధను తన బాధగా భావించగలవారే నిజమైన మహనీయులు’’ అన్నది బాపూజీకెంతో ఇష్టమైన శ్లోకం. ఏ భారతదేశం కోసం బాపూజీ తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారో, ఎలాంటి సౌభాగ్య భారతం గురించి కలలుగన్నారో దాన్ని సాకారం చేయడం కోసం నేడు 130 కోట్లమంది భారతీయులం చిత్తశుద్ధితో కలసికట్టుగా కృషిచేస్తున్నాం.
మన ప్రియతమ బాపూజీ 150వ జయంతి ఉత్సవాలను ఇవాళ ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలో సమానత, స్వాభిమానం, సార్వజనీనత, సాధికారతను ఆకాంక్షించే కోట్లాది ప్రజానీకానికి ఉజ్వల ఆశాజ్యోతిగా నేటీకీ ఆయనొక మార్గదర్శి. మానవ సమాజంపై ఆయన ప్రభావం అనుపమానం. మహాత్మాగాంధీ భారతదేశాన్ని ఆలోచన, కార్యాచరణలతో సంపూర్ణ అనుసంధానం చేశారు. ‘‘భారత్ వైవిధ్యభరిత దేశం. భిన్న త్వంలో ఏకత్వంగల మన దేశంవంటి దేశం ఈ భూమిపై ఎక్కడా లేదు. వలసపాలనపై పోరాటంలో ప్రజానీకాన్ని ఏకతాటిపై నడిపిన, భిన్నాభిప్రాయాలకు అతీతంగా ఏకీకృతం చేసిన, ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని సమున్నతంగా నిలిపిన– వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మహాత్మా గాంధీ ఒక్కరే. అయితే, ఆయన సొంత గడ్డపైనుంచి కాకుండా దక్షిణాఫ్రికా నేలమీదనుంచే ఈ కృషికి శ్రీకారం చుట్టారు. తన కాలంకన్నా ఎంతో ముందుచూపుగల భవిష్యత్ దార్శనికుడాయన. తుదిశ్వాస విడిచేదాకా తన సిద్ధాంతాలకు కట్టుబడిన మహనీయుడు’’ అన్న సర్దార్ పటేల్ పలుకులు అక్షరసత్యాలు.
మహాత్మాగాంధీ ఆలోచనలు ఆయన కాలంలో ఎంత ముఖ్యమైనవో ఈ 21వ శతాబ్దంలో కూడా అంతే ప్రాధాన్యంగలవి. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమ స్యలకు అవి పరిష్కారాలను సూచిస్తున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం, దుశ్చర్యల దిశగా, విచక్షణరహిత విద్వేషం తదితరాలు అన్ని జాతులను, సమాజాలను నిట్టనిలువునా చీల్చుతున్న నేటి ప్రపంచ పరిస్థితులలోనూ మానవాళిని ఏకం చేయగల శక్తి ఆనాడు మహాత్మాగాంధీ పిలుపునిచ్చిన శాంతి, అహింసా సిద్ధాంతాలకు ఉందనడంలో అతిశయోక్తి లేదు. అసమానతలు సహజమైపోయిన కాలంలో సమాన, సార్వజనీన ప్రగతికి బాపూ ఇచ్చిన ప్రాధాన్యం అట్టడుగునగల లక్షలాది ప్రజల శ్రేయోశకానికి బాటలు పరచగలదు. అలాగే వాతావరణ మార్పులు, పర్యావరణ పతనస్థాయికి చేరు తుండటం ప్రధాన చర్చనీయాంశాలైన ఈ శకంలో ప్రపంచం గాంధీజీ ఆలోచనలను మననం చేసుకోవాల్సి ఉంది. దాదాపు శతాబ్దం కిందట 1909లోనే మానవ ఆకాంక్షలు, మనిషి దురాశకు మధ్యగల వ్యత్యాసాన్ని ఆయన ప్రస్ఫుటం చేశారు. సహజ వనరుల వినియోగంలో సంయమనం, సహానుభూతిని ప్రబోధించడమే కాదు... ఈ ఆదర్శాన్ని పాటించడంలో తనకుతాను ఒక ఉదాహరణగా నిలిచారు. తన పరిసరాలను, తాను ఉపయోగించే మరుగుదొడ్డిని ఆయనే శుభ్రం చేసుకునేవారు. నీటి పొదుపును పాటించి వృథాను కనిష్ఠ స్థాయికి తగ్గించారు.
మహాత్మాగాంధీ స్వహస్త లిఖితమైన ఓ ప్రస్ఫుట, సమగ్ర, సంక్షిప్త పత్రం ఒకటి కొంతకాలం కిందట నా దృష్టిని ఆకర్షించింది. బాపూ 1941లో ‘నిర్మాణాత్మక కార్య క్రమం: దాని అర్థం, స్థానం’ గురించి ఆ పత్రంలో వివరించారు. అయితే, ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమం సరికొత్త ఉత్సాహం సంతరించుకున్న సందర్భంగా 1945లో ఆ పత్రాన్ని సవరించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగ బలోపేతం, పారి శుధ్యం మెరుగు, ఖాదీకి ప్రోత్సాహం, మహిళా సాధికారత, ఆర్థిక సమానత్వ సాధన తదితర అంశాలపై బాపూ ఆ పత్రంలో ఆనాడే విస్తృతంగా చర్చించారు. ఈ నేపథ్యంలో గాంధీజీ ప్రబోధించిన ‘నిర్మాణాత్మక కార్యక్రమం’ (ఇది ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ లభ్యం) గురించి పూర్తిగా తెలుసుకోవాలని నా సహ భారతీయులను కోరుతున్నాను. బాపూజీ కలలుగన్న భారతదేశాన్ని నిర్మి ంచుకోవడంలో దాన్ని మనం కరదీపికగా ఉప యోగించుకోవాలని సూచిస్తున్నాను. బాపూ ఏడు దశాబ్దాల కిందట ప్రవచించినా అందులో నేటికీ రూపుదిద్దుకోని అనేక అంశాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అనుసరణీయాలుగా స్వీకరించి అమలు చేస్తోంది.
భారతదేశ స్వాతంత్య్రం కోసం ప్రతి ఒక్కరం కషి చేస్తున్నామన్న భావనను భారతీ యులందరిలోనూ ప్రోది చేయడమన్నది గాంధీజీ వ్యక్తిత్వంలోని అత్యంత అద్భుతమైన అంశాలలో ఒకటి.
ఒక ఉపాధ్యాయుడు, న్యాయవాది, వైద్యుడు, రైతు, కార్మికుడు, పారిశ్రామికవేత్త... ఇలా వ్యక్తులెవరైనా, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తామూ తమవంతు పాత్ర పోషి స్తున్నామన్న ఆత్మవిశ్వాసంతో కూడిన స్ఫూర్తిని వారిలో నింపారు. గాంధీజీ దార్శ నికతను వాస్తవం చేసేదిశగా ఆ మహనీయుని ఆదర్శాలను పాటించడంలో ఆయన చూపిన బాటలో నడుద్దాం. ఆహార వృథాను సంపూర్ణంగా అరికట్టడం వంటి అత్యంత సాధారణ అంశం నుంచి ఆయన బోధించిన అహింస, ఐకమత్యపు విలువలదాకా దేనితోనైనా మన కృషిని ప్రారంభించవచ్చు. భవిష్యత్తరాల కోసం పరిశుభ్రత, పచ్చని పర్యా వరణం దిశగా మన వంతు కార్యాచరణ ఏమిటో ఆలోచిద్దాం. దాదాపు ఎనిమిది దశాబ్దాల కిందట కాలుష్యం ముప్పు అంతగా లేనికాలంలోనే సైకిల్ వాడకాన్ని మహాత్మాగాంధీ అనుసరించారు. ఆ మేరకు గుజరాత్ విద్యాపీఠం నుంచి సబర్మతి ఆశ్రమందాకా ఆయన సైకిల్‌పై వెళ్లడాన్ని అహ్మదాబాద్ వాసులు నేటికీ జ్ఞాపకం చేసుకుంటారు. నిజానికి... దక్షిణాఫ్రికాలో గాంధీజీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో ఒకటి ప్రజలు సైకిల్ తొక్కడంపై ఆంక్షలు విధించడానికి నిరసనగా చేపట్టినదని నేనొక చోట చదివాను. న్యాయవాద వృత్తిలో పేరు ప్రతిష్ఠలు, ఆర్జన సమృద్ధిగా ఉన్న రోజుల్లోనూ ఆయన జోహాన్నెస్‌బర్గ్‌లో సైకిల్‌పైనే ప్రయాణించే వారట! ఆయన స్ఫూర్తిని మనం నేడు అనుసరించలేమా?
ఈ పండుగలవేళ దేశవ్యాప్తంగా ప్రజలు కొత్త దుస్తులు, బహుమతులు, మిఠా యిలు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేసే సమయంలో మనం గాంధీజీ చురుకైన ఆలోచనల పరంపర నుంచి కొన్నిటిని గుర్తు తెచ్చుకుందాం. మన చర్యలు మన సహ భారతీయులు తయారుచేసే వస్తువుల కొనుగోలు ద్వారా వారి జీవితాల్లో సౌభాగ్య దీపాన్ని ఎలా వెలిగించగలమో ఆలోచిద్దాం. అది ఖాదీ కావచ్చు... బహుమతిగా ఇచ్చే వస్తువు కావచ్చు లేదా తిను బండారం కావచ్చు... వాటిని కొనుగోలు చేయడంవల్ల మెరుగైన జీవితం దిశగా వారు చేస్తున్న ప్రయ త్నాలకు మనం ఎంతో తోడ్పడవచ్చు.
స్వచ్ఛభారత్ ఉద్యమం రూపంలో గడచిన నాలుగేళ్లుగా 130 కోట ్లమంది భారతీయులు మహా త్మాగాంధీకి నివాళి అర్పి ంచారు. ప్రతి భారతీయుడి కఠోర శ్రమతో ఇవాళ్టితో నాలు గో ఏడాది పూర్తి చేసుకుంటున్న స్వచ్ఛభారత్ ఉద్యమం ప్రశంస నీయ ఫలితాలతో ఒక ఉత్తేజకర ప్రజా ఉద్యమ రూపుదాల్చింది. దేశంలో తొలిసారి 8.5 కోట్లకుపైగా కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే 40 కోట్లమందికిపైగా భారతీయులకు నేడు బహిరంగ విసర్జన చేయాల్సిన దుస్థితి తప్పింది. కేవలం నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలోనే పారిశుధ్యం అందుబాటు 39 శాతం నుంచి 95 శాతానికి దూసుకుపోయింది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోగల 4.5 లక్షల గ్రామాలు ఇవాళ బహిరంగ విసర్జనరహితంగా మారాయి. స్వచ్ఛభారత్ ఉద్యమం మన గౌరవం, మెరుగైన భవిష్యత్తుకు ఉద్దేశించినది. ఇది కోట్లాది మహిళలకు శుభ సూచకం ప్రతి ఉదయం ప్రకృతి పిలుపు సమయంలో ముఖాలు దాచుకోవా ల్సిన దుస్థితి ఇకపై చరిత్రగా మిగిలిపోతుంది.
కొన్ని రోజుల కిందట ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నేను ప్రసంగి స్తుండగా రాజస్తాన్ నుంచి ఒక దివ్యాంగ సోదరుడు నాకు ఫోన్ చేశాడు. రెండు కళ్లూ కనిపించని తన జీవితంలో వ్యక్తిగత మరుగుదొడ్డి ఎంతటి సానుకూల మార్పును తెచ్చిందో కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఆ సమయంలో అతడినుంచి అందిన ఆశీర్వాదాలను నేను జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకుంటాను.
నేటి భారతీయులలో అత్యధిక శాతానికి నాటి స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యే అదష్టం లేదనే చెప్పాలి. ఇప్పటి మనలో చాలామందికి అప్పటి రోజుల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసే అవకాశం లేదు. కానీ, మన జాతి ప్రగతికి, మన స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతదేశ నిర్మాణానికి వీలైనంత మేర శ్రమించడం కోసం మనం జీవించాల్సిన సమయమిది. బాపూజీ కలలు సాకారం చేసే గొప్ప అవకాశం ఇవాళ మన చేతుల్లో ఉంది. ఇప్పటికే మన మెంతో సాధిం చాం. రాబోయే రోజుల్లో మరెంతో సాధించగలమన్న దృఢవిశ్వాసం నాకుంది.
‘‘పరుల బాధను తన బాధగా భావించగలవారే నిజమైన మహనీయులు’’ అన్నది బాపూజీకెంతో ఇష్టమైన శ్లోకం. ఏ భారతదేశం కోసం బాపూజీ తన జీవితాన్ని తృణప్రాయంగా అర్పించారో, ఎలాంటి సౌభాగ్య భారతం గురించి కలలుగన్నారో దాన్ని సాకారం చేయడం కోసం నేడు మనం... 130 కోట్లమంది భారతీయులం చిత్తశుద్ధితో కలసికట్టుగా కృషిచేస్తున్నాం.
నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి
Comments
Please login to add a commentAdd a comment