
సాక్షి,దహేజ్(గుజరాత్): ఆర్థిక సంస్కరణల అమలులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి నిర్ణయాలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నక్రమంలో కీలక నిర్ణయాలు కొనసాగుతాయని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. జీఎస్‌టీ అమలు పట్ల గుర్రుగా ఉన్న వ్యాపార వర్గాలకు చేరువయ్యేందుకు ప్రధాని ప్రయత్నించారు. జీఎస్‌టీలో నమోదైన వ్యాపారులను పాత రికార్డులకు సంబంధించి పన్ను అధికారులు ఇబ్బంది పెట్టబోరని తేల్చిచెప్పారు.
సంస్కరణలు కొనసాగించడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలపైకి ఎక్కిందని, మెరుగైన దిశలో సాగుతున్నదని ప్రధాని చెప్పుకొచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో కూరుకుపోయిందన్న విమర్శలను ప్రధాని తోసిపుచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని పలువురు ఆర్థిక వేత్తలు అంగీకరించారన్నారు.
దేశంలో బొగ్గు, విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, విదేశీ పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. విదేశీ ద్రవ్య నిల్వలు సైతం రికార్డుస్థాయిలో 30,000 కోట్ల డాలర్ల నుంచి 40,000 కోట్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు. జీఎస్‌టీలో చేరే వ్యాపారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. రాష్ట్రాల చెక్‌పోస్ట్‌ల వద్ద జీఎస్‌టీతో అవినీతికి చెక్ పడిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment