ఎయిరిండియా నుంచి రాజుగారికి గుడ్బై!!
భారతీయ విమానాలు అనగానే.. ఎయిరిండియా అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తల ఒక పక్కకు వంచి, స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించే మహారాజు. ఆ సింబల్ ఎన్నాళ్లుగానో ఎయిరిండియాకు మస్కట్గా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు అది మారిపోనుంది. మహారాజు స్థానంలో సామాన్యుడిని ఎయిరిండియా మస్కట్గా పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా ఆర్థిక పరిస్థితి గురించి వివరించడానికి ప్రధానిని కలిసినప్పుడు రాజుగారికి ఆయనీ విషయం చెప్పారు.
దాదాపు 49వేల కోట్ల రుణాలు ఉండటంతో ఎయిరిండియా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనిపై మంత్రితో పాటు ఆ శాఖ కార్యదర్శి అశోక్ లావాసా కూడా ప్రధానికి వివరించారు. దీన్నుంచి బయటపడాలంటే ఏ రకమైన సంస్కరణలు తేవాలన్న సూచనలను ఆయన శ్రద్ధగా ఆలకించారు. విమానాశ్రయాలకు హైవేలతోను, ఓడరేవులతోను అనుసంధానం ఉండటం, వాణిజ్య అవసరాల కోసం నగరాలకు సమీపంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం, సీసీ టీవీలను కేవలం భద్రత కోసమే కాక, విమానాశ్రయాల్లో పరిశుభ్రతను చూసేందుకూ వాడటం ద్వారా ఆదరణ, లాభాలు పెంచుకోవచ్చని ప్రధాని సూచించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు.