
కొత్త బంగారు లోకం
- బంగారు నగలపై మగవారికి పెరుగుతున్న మోజు
- వినూత్న తరహాలో తయారవుతున్న మేల్ జువెలరీ
అనంతపురం కల్చరల్ : ఫ్యాషన్ కాల చక్రం గిర్రున తిరుగుతూ.. మళ్ళీ మొదటికి వస్తోంది. ఆడవారికే పరిమితమైన పసిడి నగలు మగవారిని సైతం ఆకర్షిస్తున్నాయి. చెవికి రింగు, చేతికి బ్రాస్‌లెట్, మెడలో ట్రెండ్ సెట్ చేస్తున్న ఆకర్షణీయమైన చైన్ ధరించే యువకుల సంఖ్య పెరుగుతోంది. పర్యవసానంగా రెండు మూడేళ్లుగా మేల్ జ్యువెలరీకి డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఇక్కడివారు ఇటువంటి వాటిని కొనాలంటే పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అనంతపురంలోని పలు జ్యువెలరీ మార్ట్స్ అన్ని రకాల ఫ్యాషన్స్‌నూ అందుబాటులోకి తెచ్చాయి.
సచిన్ మార్కు చైన్‌లదే ట్రెండ్
మహిళలు ధరించే చాలా రకాల ఆభరణాలను మగవారు కూడా మోజుగా ధరిస్తున్నారు. ముఖ్యంగా మెడలో చైన్ వేసుకోవడం అన్నది పాత పద్ధతే అయినా మహిళలు, పురుషులు ఒకే రకమైన చైన్లు వాడడం లేదు. ఎవరి ఫ్యాషన్ వారిదే. ప్రత్యేక తరహాలో తయారవుతున్న చైన్లలో సచిన్ టెండూల్కర్ వాడే చైన్ల డిజైన్లు రాజ్యమేలుతున్నాయి. దళపతి చైన్, రోప్ చైన్, మంగళూరు చైన్ వంటివి ఎన్నున్నా సచిన్ చైన్‌కే డిమాండ్ ఎక్కువ. దాదాపు ఒకటి నుంచి రెండు తులాలలోపు ఉండే ఆ చైన్లంటే యువత వెర్రిక్కిపోతోంది. అదేవిధంగా చేతికి బ్రాస్‌లెట్ సాధారణంగా మగవారు ధరించేదే అయినా వాటిలోనూ మేల్, ఫిమేల్ అంటూ అనేక రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. పూర్వం వాడిన కడియాలు మళ్లీ పురుడు పోసుకున్నాయి. పలు రకాల డిజైన్లు యువతను ఆకట్టుకుంటున్నాయి. సిక్కులు వాడే ఐరన్ కడియాల్లాంటివి ఇప్పుడు పసిడితో రూపుదిద్దుకుని ఫ్యాషన్‌గా చలామణి అవుతున్నాయి.
చెవి రింగులు ప్రత్యేకం
ఒక చెవికి రింగు పెట్టుకోవడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. హీరోలంతా దానినే ఫాలో అవుతుంటే యువత రింగు..రింగున ఊగే చెవి రింగుల కోసం వెంటపడుతోంది. సింగిల్ స్టోన్, డైమండ్ స్టడ్ వంటివి అధికంగా వాడుతున్నారు. కనపడీ కనపడనట్టుండే టైపు ఒకటైతే.. చెవికి వేలాడుతున్నట్టు నిండుగా ఉండడం మరొక ఫ్యాషన్. అయితే చేతి వేళ్లకు రింగులు పెట్టుకోవడం జాతక రీత్యా ఉంటున్నట్టే, చెవి రింగులు ఆరోగ్య రీత్యా కూడా మంచిదంటూ వాటిని ధరిస్తున్నారు.
డాబు దర్పమే కాదు...సెంటిమెంటు కూడా..
మగవాళ్లు ప్రత్యేక నగలు ధరించడం ఇటీవల ప్రారంభమైంది. కానీ నేను పన్నెండేళ్ల నుంచే ఒంటి నిండా బంగారు నగలు ధరిస్తున్నా. చాలా మంది బంగారు నగలు ధరించడమంటే డాపు దర్పమని మాత్రమే అనుకుంటారు. కానీ నేను జాతకరీత్యా కూడా ఇటువంటి వి చాలా మంచిదని వాడుతున్నాను. ఇంకొక ఆసక్తికరమైన విషయమేమంటే చాలా మంది శిష్యులు నాకు గురుదక్షిణ కింద వీటిని బహూకరించినారు. ఈ సంప్రదాయం అతి తక్కువ మంది వద్ద ఉంది. నా దగ్గర బ్రాస్‌లెట్, ఎనిమిది ఉంగరాలు, చైన్లు, కంకణం మొత్తం 13 తులాల బంగారు ఉంటుంది.
- పట్నం శివప్రసాద్, నాట్యాచార్యులు, అనంతపురం
హృదయానికి దగ్గర సంబంధముంది
చెవి రింగు పెట్టుకోవడం చాలా మంది ఫ్యాషన్ అనుకుంటారు. కానీ హార్ట్‌కు చాలా మంచిదన్నది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నేను దాదాపు పదేళ్ల కిందట సైన్స్ పుస్తకాలలో చదివి అప్పటి నుంచి చెవికి రింగు పెట్టుకుంటున్నాను. చెవి కుట్టిస్తే హార్ట్ అటాక్ తక్కువగా ఉంటుందని పెద్దల విశ్వాసం. ఆడవాళ్లకు హార్ట్ అటాక్ రావడం అరుదుగా ఉంటే మగవాళ్లు ఎక్కువగా హార్ట్ అటాక్‌కు గురికావడం చూస్తుంటే చెవి కుట్టించుకుంటే మంచిదనిపిస్తుంది. దాంతో మా ఇంట్లో మగవాళ్లం కూడా చెవికి రింగు ధరిస్తున్నాము.
- వెంకట్రాముడు, గిరిజా మెడికల్స్, అనంతపురం