బిచ్చగాళ్లను చేశారు: మమత
కోల్‌కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలను బిచ్చగాళ్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మంగళవారం ఆరోపించారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు క్యూలు కట్టుకుని బిచ్చగాళ్లలా నిలబడ్డారన్నారు. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకున్నా తృణమూల్ ముందుకు సాగుతుందన్నారు. ‘బుధవారం 40 మంది తృణమూల్ ఎంపీలతో కలసి రాష్ట్రపతిని కలుస్తున్నా.అందరూ కలిసొస్తే బాగుంటుంది’ అని తెలిపారు.రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు మమత చేపట్టిన ర్యాలీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, సీపీఎం నిర్ణయించాయి. ర్యాలీలో శివసేనపాల్గొనే అవకాశముంది.
తల్లితో మోదీ రాజకీయాలు: కేజ్రీ
న్యూఢిల్లీ: డబ్బులు మార్చుకునేందుకు ప్రధాని మోదీ తల్లి, హీరాబెన్ క్యూలో నిలుచోవటాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. 97 ఏళ్ల తల్లిని క్యూలైన్లో నిలబెట్టి రాజకీయాలు చేయటాన్ని ప్రధాని మానుకోవాలన్నారు. ఒకవేళ తనకు ఆ పరిస్థితి వస్తే తల్లి బదులుగా తనే లైన్లో నిలబడతానన్నారు. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలని రాష్ట్రపతికి దీన్ని పంపనున్నారు.మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.12 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
ఇవేనా అచ్ఛేదిన్: చిదంబరం
నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయం హాస్యాస్పదమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అచ్ఛేదిన్ ఇవేనా.. ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘బ్యాంకులేమైనా నిరుద్యోగులకు భృతి ఇస్తున్నాయా? ఇవేనా అచ్ఛేదిన్’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ చేతిలో 12లక్షల కోట్లు: అమిత్ షా
అహ్మదాబాద్: నల్లధనంపై కాంగ్రెస్ నేత విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నేతలు రూ.12 లక్షల కోట్లకు పైగా సంపాదించారని.. రాత్రికి రాత్రి ప్రధాని మోదీ వీటిని చిత్తుకాగితాల్లా మార్చేశారన్నారు. రూ. 4 కోట్ల కారులో రూ. 4వేల కోసం రాహుల్ బ్యాంకుకు వెళ్లటం హాస్యాస్పదమన్నారు.
జనం చస్తోంటే నవ్వులా?: రాహుల్ గాంధీ
ముంబై: నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి 18-20 మంది ప్రజలు చనిపోతే.. ప్రధాని మోదీ నవ్వుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జపాన్‌లో మోదీ మాటలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నవ్వుతున్నారో లేక బాధపడుతున్నారో ఆయనే స్పష్టంచేయాలన్నారు. పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం అసంబద్ధంగా ఉందని ధ్వజమెత్తారు.