బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీలో పాల్గొన్న నేతలు సిద్ధరామయ్య, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్‌పవార్, సీతారాం ఏచూరి, జైరాం రమేశ్, రాజా, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు
బెంగళూరు: 26 విపక్ష పార్టీలు సమైక్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల సమరనాదం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఒక్క తాటిపైకి వచ్చాయి. ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) పేరుతో కొత్త కూటమిగా ఆవిర్భవించాయి. సమైక్యతా ప్రయత్నాల్లో భాగంగా సోమవారం బెంగళూరులో మొదలైన విపక్షాల రెండు రోజుల భేటీ మంగళవారం సాయంత్రం ముగిసింది. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే తదితర 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు పలు అంశాలపై నాలుగు గంటల పాటు కూలంకషంగా చర్చించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాందీ, రాహుల్‌గాందీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కర్టీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితర దిగ్గజాలంతా భేటీలో పాల్గొన్నారు. విపక్ష కూటమికి ఇండియాగా నామకరణం చేశారు. కూటమి భాగస్వాముల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు.
ముంబై భేటీలో కీలక నిర్ణయాలు: ఖర్గే
ముంబైలో జరగబోయే విపక్షాల తర్వాతి భేటీలో కమిటీ కన్వీనర్ ఎంపికతో పాటు పలు ఇతర కీలక నిర్ణయాలుంటాయని ఖర్గే తెలిపారు. కూటమికి ఇండియాగా నామకరణం చేసినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా పోరాడి ఘనవిజయం సాధించి తీరతామని ధీమా వెలిబుచ్చారు. విపక్షాలన్నా, తాజాగా పురుడు పోసుకున్న 26 విపక్షాల కూటమి అన్నా మోదీకి భయం పట్టుకుందని ఖర్గే ఎద్దేవా చేశారు. అయితే కూటమి సారథి ఎవరన్న ప్రశ్నకు మాత్రం ఖర్గే నేరుగా బదులివ్వలేదు.
కాంగ్రెస్‌కు అధికారంపై గానీ, ప్రధాని పదవిపై గానీ ఆసక్తి లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని వెల్లడించారు. అందుకే కూటమిలో పలు పక్షాల మధ్య భేదాభిప్రాయాలున్నా విస్తృత ప్రయోజనాల కోసం, దేశ శ్రేయస్సు కోసం వాటన్నింటినీ పక్కన పెట్టి ఒక్కతాటిపైకి వచ్చామని చెప్పుకొచ్చారు. భేటీ అనంతరం ఖర్గే సహా విపక్షాల నేతలంతా సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. సోమవారం భేటీలో పాల్గొనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు ముఖ్య నేతలంతా పాల్గొన్నారు.
రాహుల్ మా ఫేవరెట్
దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండియా కూటమిని సవాలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని మీడియాతో మాట్లాడుతూ మమత నిలదీశారు. ‘‘మా మాతృభూమి అంటే మాకు ప్రాణం. మేం దేశభక్తులం. మేం రైతులం, దళితులం. మేం మా దేశం కోసం, ప్రపంచం కోసం పాటుపడేవాళ్లం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న పని ఒక్కటే. ప్రభుత్వాలను కొనడం, అమ్మడం!’’ అంటూ విరుచుకుపడ్డారు. ‘‘ఇండియా నెగ్గుతుంది. మన దేశం నెగ్గుతుంది. బీజేపీ ఓడుతుంది’’ అని జోస్యం చెప్పారు.
‘‘నేటి సంయుక్త డిక్లరేషన్ ద్వారా పాలక ఎన్డీఏ కూటమిపై మా విపక్ష కూటమి 420 సెక్షన్ విధిస్తోంది’’ అని ప్రకటించారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 మోసానికి సంబంధించిన కేసులకు వర్తిస్తుంది. రాహుల్ గాంధీ తమ ఫేవరెట్ అంటూ దీదీ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలందరినీ పలకరించే క్రమంలో ఆమె చేసిన ఈ కామెంట్ పలు రకాల చర్చలకు దారి తీసింది.
ఎవరేమన్నారంటే...
1. ‘‘మేం మా కుటుంబాల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని కొందరంటున్నారు. కానీ వాళ్లు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేశమే మా కుటుంబం. ఆ కుటుంబం కోసమే మేం పోరాడుతున్నాం. మా పోరు ఒక వ్యక్తిపై కాదు. ఒక నియంతృత్వ పోకడపై. ఈ నియంతృత్వాన్ని చూసి దేశ ప్రజలు భయపడుతున్నారు. మై హూ నా (నేనున్నా) అని ఒక హిందీ సినిమా వచ్చింది. మేం కూడా హమ్ హై నా (మేమున్నాం) అని ప్రజలకు భరోసా ఇవ్వదలచాం’’
– మోదీపై ఉద్ధవ్ ఠాక్రే (శివసేన–యూబీటీ) విసుర్లు
2. ‘‘గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ఎంతో చూసే గొప్ప అవకాశం ప్రధాని మోదీకి దక్కింది. కానీ ఏ రంగంలోనూ ఏమాత్రమూ అభివృద్ధి జరగలేదు’’
అరవింద్ కేజ్రీవాల్
3. 2024లో నూతన భారత ఆవిర్భావం
‘‘దేశంలో నియంతృత్వం సాగుతోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం సంక్షోభంలో పడ్డాయి. కానీ 2024లో సరికొత్త భారత్ ఆవిర్భవించడం ఖాయం. జూన్‌లో జరిగిన పట్నా భేటీలో 15 పార్టీలుగా ఉన్న విపక్ష కూటమి బలం బెంగళూరు భేటీ నాటికి 26 పార్టీలకు విస్తరించడం రాబోయే మార్పుకు ప్రబల సంకేతం. దేశాన్ని ఎవరు పాలించకూడదు అన్నదాని మీదే ప్రధానంగా మా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిపై దేశ ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. వాటిని నెరవేర్చి తీరతాం’’
– తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్
‘ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు...
కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీ(యూ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్), సీపీఎం, సీపీఐ, శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆరెల్డీ, ఎండీఎంకే, కేఎండీకే, వీసీకే, ఆరెస్పీ, సీపీఐ–ఎంఎల్ (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), అప్నాదళ్ (కమెరవాదీ), ఎంఎంకే
లోక్‌సభలో బలాబలాలు
ఎన్డీఏ కూటమి – 330పై చిలుకు ఎంపీలు
26 విపక్షల ‘ఇండియా’ కూటమి – 150 మంది ఎంపీలు
(విపక్ష కూటమిలోని పార్టీలు ఢిల్లీలోనూ, మరో 10 రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నాయి)
దీదీ పెట్టిన పేరు!
విపక్ష కూటమికి ఇండియా అన్న పేరు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దాని పూర్తి పేరు ఎలా ఉంటే బాగుంటుందని నేతలంతా లోతుగా చర్చించినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment