‘యూపీలో బీజేపీకి దక్కే స్ధానాలు ఇవే’ | Mamata Banerjee Predicts A Non BJP Government Will Be Formed In The Centre | Sakshi
Sakshi News home page

‘యూపీలో బీజేపీకి దక్కే స్ధానాలు ఇవే’

Published Tue, May 14 2019 3:09 PM | Last Updated on Tue, May 14 2019 5:47 PM

Mamata Banerjee Predicts A Non BJP Government Will Be Formed In The Centre - Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే కొలువుతీరుతుందని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. మిత్రపక్షాల తో కలిసి బీజేపీకి 150 స్ధానాలు వస్తాయని, బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినా విస్పష్ట మెజారిటీ రాదని స్పష్టం చేశారు.

యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌ వంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అంచనా వేశారు. 2014లో యూపీలో 80 స్ధానాలకు గాను బీజేపీకి 73 స్ధానాలు దక్కడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. యూపీలో ఈసారి బీజేపీకి 13 నుంచి 17 స్ధానాలు మాత్రమే లభిస్తాయని, ఎస్పీ-బీఎస్పీకి 55 స్ధానాలు వస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందన్నారు.

ప్రధాని రేసులో ఎవరుంటారనేది ఎన్నికల ఫలితాల అనంతరం విపక్షాలు నిర్ణయిస్తాయని చెప్పారు. మమతా బెనర్జీ మంగళవారం ఓ వార్తాచానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. మోదీ భయభ్రాంతులకు గురిచేసి విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోదీ సర్కార్‌పై గళమెత్తిన వారిపై సీబీఐతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తాను సీబీఐ దాడులకు భయపడనని, బీజేపీని అధికారం నుంచి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 125-150 స్ధానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, కాంగ్రెస్‌కు సైగం 125-130 స్ధానాలు లభిస్తాయని, ప్రాంతీయ పార్టీలు జతకడితే బీజేపీ కంటే ఎక్కువ స్ధానాలు కూటమి వైపు ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement