ర్యాలీలో ముందుకు సాగుతున్న మమత
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు.
మోదీ గుంజిళ్లు తీయాలి..
బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు.
ఈసీ అమ్ముడుపోయింది..
సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment