Ishwar Chandra Vidyasagar
-
‘మోదీ గుంజిళ్లు తీయాలి’
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. మోదీ గుంజిళ్లు తీయాలి.. బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈసీ అమ్ముడుపోయింది.. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. -
మీ వివేకాన్ని పెంచుకోండి!
ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కేవలం బెంగాల్‌కి పరిమితం అయిన వ్యక్తి కాదు. భారతీయ సాంస్కృతిక వికాసోద్యమానికి దారి చూపిన మార్గదర్శకుడు. సంకుచిత భావాలతో కుళ్ళి కంపు కొడుతున్న ఛాందస భావాలను కాదని భావోద్యమాలకి రాచబాట వేసిన సంఘ సంస్కర్త. గ్రాంధిక భాషకి బదులు వాడుక భాషని కొత్త పుంతలు తొక్కించి ప్రజల భాషకి పట్టం కట్టిన రచయిత. సామాజిక చైతన్యాన్ని కలిగించే అనేక రచనలు చేయడంతోపాటూ స్వయంగా అనేక గ్రంథాల్ని ముద్రించినవాడు. వితంతు పునర్వివాహాల కోసం నిరవధిక పోరాటం చేయడమే కాదు, ఏకంగా చట్టం కూడా చేయించేదాకా అలుపెరగని కృషి చేశారు. ఆంధ్రదేశం లోని మన కందుకూరి వీరేశలింగంతో మొదలుపెట్టి దేశంలోని అనేక ప్రాంతాలలో సాంస్కృతిక వికాసానికి దారి చూపిన మహానుభావుడు. విద్యా విధా నం మొదలుకొని వివాహాది విషయాల వరకూ ఆనాడే ఎంతో ప్రగతిశీలంగా ఆలోచించడమే కాదు, అనుకున్న దానిని ఆచరణలో పెట్టిన ఆదర్శవాది. అమిత్ షా యాత్రలో భాగంగా కోల్‌కతాలోని సిటీ కాలేజీ విద్యార్థులపై మతోన్మాదులు అమానుష దాడి చేయడమే కాక ఏకంగా కళాశాల ఆవరణ లోని విద్యాసాగరుడి విగ్రహాన్ని కూల్చ డం మతతత్వశక్తుల అవివేకానికి పరా కాష్ట. సిటీ కాలేజ్ చారిత్రక ప్రాముఖ్యం కలది. తూ.గో.జిల్లాలోని మా పిఠాపురానికి, బెంగాల్‌లోని కోల్‌కతా సిటీ కాలేజీకి అనుబంధం ఉంది. సిటీ కాలేజీ నిర్మాణానికి ఉదారంగా ముందుకొచ్చి స్పందించిన వ్యక్తిగా పిఠాపురం యువ రాజాని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అటువంటి మహోన్నత కళాశాలపై దాడికి దిగడం మతోన్మాదుల అజ్ఞానానికి చిహ్నం. గాంధీ, అంబేడ్కర్, లెనిన్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్.. ఈనాటికీ మతోన్మాదులను విగ్రహాలుగా సైతం భయ పెడుతున్నారంటే నాటి వాళ్ళ కృషి ఎంతటిదో అర్థం చేసుకోవాల్సిందే. విగ్రహాల్ని కూల్చడం కాదు, వివేకాన్ని పెంచుకోవడమొక్కటే విద్వేష శక్తులకి మిగిలున్న ఏకైక మార్గం. విభేదాలు ఎన్నున్నా ఈశ్వర్‌చంద్ర సాగర్ విగ్రహ కూల్చివేతను అభ్యుదయ శక్తులు, ఆలోచనాపరులంతా ఖండించాలి. మతోన్మాదుల ఆగ డాల్ని ప్రజాస్వామికవాదులంతా నిరసించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్! – గౌరవ్ కృçష్ణ, పిఠాపురం కోల్‌కతా కాలేజీలో ధ్వంసమైన ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం -
ఎవరీ ఈశ్వర చందా విద్యాసాగర్!
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో మంగళవారం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన విధ్వంసకాండలో బలైందీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం. కోల మొహం, దాదాపు ముప్పావు భాగం బట్టతల, భుజాల మీదుగా మెడ చుట్టూ శాలువా, తీక్షణమైన చూపులతో కనిపించే విద్యాసాగర్ బెంగాల్ ప్రజలందరికి దాదాపు సుపరిచితులు. పాఠశాలల్లో, కళాశాలల్లో, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఆయన విగ్రహాలు కనిపిస్తాయి. ఆయన పేరుతో కాలేజీ, పలు పాఠశాలలు ఉన్నాయి. బెంగాల్లో ఓ వంతెన కూడా ఆయన పేరుతోనే ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఆయన విద్యాసాగరుడు. పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా విజ్ఞాన తృష్ణతో, జ్ఞాన దృష్టితో వీధి దీపాల కింద చదువుకున్నారు. బెంగాలీ భాషకు సముచితమైన అక్షర క్రమాన్ని కూర్చి ఆ భాషను క్రమబద్ధీకరించారు. మొత్తం బెంగాల్ పునరుత్థావనంకే మూల పురుషుడయ్యారు. 1856లో నాటి బ్రిటీష్ ప్రభుత్వం హిందూ వితంతు స్త్రీల పునర్వివాహానికి చట్టం తీసుకరావడానికి ప్రధాన కారకుడయ్యారు. ప్రముఖ విద్యావేత్తగా, తాత్వికుడిగా, కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా ప్రశంసలు అందుకున్న విద్యాసాగర్ 1820లో బిర్సింఘా గ్రామంలో జన్మించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఆదర్శ విద్యార్థి విద్యాసాగరే. కరెంట్ కోతలు ఎక్కువగా ఉండే బెంగాల్లో ఇంట్లో కరెంట్‌లేని వేళల్లో విద్యాసాగర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు వీధి దీపాల వద్దకు వెళ్లి చదువుకోవడం కూడా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. విద్యాసాగర్ తన తొమ్మిదవ ఏట తన గ్రామం నుంచి కోల్‌కతాకు పయనమయ్యారు. పలు ఉపకార వేతనాలతో విద్యను కొనసాగించారు. 1824లో బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్కృత కళాశాలలో చదువుకొని స్కాలర్ అయ్యారు. అయినప్పటికీ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించారు. 1851లో ఆయన ప్రభుత్వ సంస్కృత కళాశాలకు తొలి భారతీయ ప్రిన్సిపాల్ అయ్యారు. 1856లో ఆయన స్వయంగా బారిష హైస్కూల్‌ను స్థాపించారు. 1872లో విద్యాసాగర్ కాలేజీ కూడా వచ్చింది. ఆయన స్ఫూర్తిపరులంతా ఆ కళాశాల ఏర్పాటుకు తలోచేయి వేశారు. అన్ని కులాల బాలలతోపాటు బాలికలకు కూడా చదువు అందుబాటులో ఉండాలంటూ తానే స్వయంగా పలు పాఠ శాలల ఏర్పాటుకు కృషి చేశారు. బాల్య వివాహాలను, కొన్ని కులాల్లో బహు భార్యత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆధునిక విద్య కోసం కృషి చేశారు. పలు సంస్కరణల కోసం బ్రిటీష్ పాలకులను మెప్పించి ఒప్పించారు. 1857 సైనిక తిరుగుబాటుగా పేర్కొంటున్న తొలి స్వాతంత్య్ర పోరాటంతో బ్రిటీష్ పాలకులు సంస్కరణలకు వెనకడుగు వేశారు. భారతీయులను ప్రాచీన నమ్మకాలకు పరిమితం చేస్తేనే భారతీయులు స్వాతంత్య్రం జోలికి వెళ్లరని వారు భావించారు. విద్యాసాగర్ మాత్రం సామాజిక సంస్కరణల కోసం చేస్తోన్న తన పోరాటాన్ని ఆపలేదు. వేదాలకు సముచిత తాత్పర్యాలు కొత్తగా చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో కర్మతార్‌లో ఆదివాసులకు హోమియో వైద్యం ద్వారా సేవలు చేశారు. 1891లో పరమపదించారు. అంతటి మహానుభావుడి చరిత్ర విగ్రహ విధ్వంసంతో వినాశనం కాదు. (చదవండి: బెంగాల్లో ప్రాంతీయం వర్సెస్ జాతీయం)