ఎవరీ ఈశ్వర చందా విద్యాసాగర్‌! | Path Breaking Reformer Ishwar Chandra Vidyasagar | Sakshi
Sakshi News home page

ఎవరీ ఈశ్వర చందా విద్యాసాగర్‌!

Published Wed, May 15 2019 6:53 PM | Last Updated on Wed, May 15 2019 8:31 PM

Path Breaking Reformer Ishwar Chandra Vidyasagar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో మంగళవారం తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన విధ్వంసకాండలో బలైందీ ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం. కోల మొహం, దాదాపు ముప్పావు భాగం బట్టతల, భుజాల మీదుగా మెడ చుట్టూ శాలువా, తీక్షణమైన చూపులతో కనిపించే విద్యాసాగర్‌ బెంగాల్‌ ప్రజలందరికి దాదాపు సుపరిచితులు. పాఠశాలల్లో, కళాశాలల్లో, ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద ఆయన విగ్రహాలు కనిపిస్తాయి. ఆయన పేరుతో కాలేజీ, పలు పాఠశాలలు ఉన్నాయి. బెంగాల్‌లో ఓ వంతెన కూడా ఆయన పేరుతోనే ఉంది. పేరుకు తగ్గట్టుగానే ఆయన విద్యాసాగరుడు. పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా విజ్ఞాన తృష్ణతో, జ్ఞాన దృష్టితో వీధి దీపాల కింద చదువుకున్నారు. బెంగాలీ భాషకు సముచితమైన అక్షర క్రమాన్ని కూర్చి ఆ భాషను క్రమబద్ధీకరించారు. మొత్తం బెంగాల్‌ పునరుత్థావనంకే మూల పురుషుడయ్యారు. 1856లో నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం హిందూ వితంతు స్త్రీల పునర్వివాహానికి చట్టం తీసుకరావడానికి ప్రధాన కారకుడయ్యారు.

ప్రముఖ విద్యావేత్తగా, తాత్వికుడిగా, కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా ప్రశంసలు అందుకున్న విద్యాసాగర్‌ 1820లో బిర్సింఘా గ్రామంలో జన్మించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఆదర్శ విద్యార్థి విద్యాసాగరే. కరెంట్‌ కోతలు ఎక్కువగా ఉండే బెంగాల్లో ఇంట్లో కరెంట్‌లేని వేళల్లో విద్యాసాగర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు వీధి దీపాల వద్దకు వెళ్లి చదువుకోవడం కూడా కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. విద్యాసాగర్‌ తన తొమ్మిదవ ఏట తన గ్రామం నుంచి కోల్‌కతాకు పయనమయ్యారు. పలు ఉపకార వేతనాలతో విద్యను కొనసాగించారు. 1824లో బ్రిటీష్‌ పాలకులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్కృత కళాశాలలో చదువుకొని స్కాలర్‌ అయ్యారు. అయినప్పటికీ ప్రాంతీయ భాషలను ప్రోత్సహించారు. 1851లో ఆయన ప్రభుత్వ సంస్కృత కళాశాలకు తొలి భారతీయ ప్రిన్సిపాల్‌ అయ్యారు. 1856లో ఆయన స్వయంగా బారిష హైస్కూల్‌ను స్థాపించారు. 1872లో విద్యాసాగర్‌ కాలేజీ కూడా వచ్చింది. ఆయన స్ఫూర్తిపరులంతా ఆ కళాశాల ఏర్పాటుకు తలోచేయి వేశారు.

అన్ని కులాల బాలలతోపాటు బాలికలకు కూడా చదువు అందుబాటులో ఉండాలంటూ తానే స్వయంగా పలు పాఠ శాలల ఏర్పాటుకు కృషి చేశారు. బాల్య వివాహాలను, కొన్ని కులాల్లో బహు భార్యత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆధునిక విద్య కోసం కృషి చేశారు. పలు సంస్కరణల కోసం బ్రిటీష్‌ పాలకులను మెప్పించి ఒప్పించారు. 1857 సైనిక తిరుగుబాటుగా పేర్కొంటున్న తొలి స్వాతంత్య్ర పోరాటంతో బ్రిటీష్‌ పాలకులు సంస్కరణలకు వెనకడుగు వేశారు. భారతీయులను ప్రాచీన నమ్మకాలకు పరిమితం చేస్తేనే భారతీయులు స్వాతంత్య్రం జోలికి వెళ్లరని వారు భావించారు. విద్యాసాగర్‌ మాత్రం సామాజిక సంస్కరణల కోసం చేస్తోన్న తన పోరాటాన్ని ఆపలేదు. వేదాలకు సముచిత తాత్పర్యాలు కొత్తగా చెప్పారు. ఆయన తన చివరి రోజుల్లో కర్మతార్‌లో ఆదివాసులకు హోమియో వైద్యం ద్వారా సేవలు చేశారు. 1891లో పరమపదించారు. అంతటి మహానుభావుడి చరిత్ర విగ్రహ విధ్వంసంతో వినాశనం కాదు. (చదవండి: బెంగాల్లో ప్రాంతీయం వర్సెస్‌ జాతీయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement