'ఎండ'కు కరిగిన స్టార్ హీరో.. సీఎంతో భేటీ
ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. నీళ్లు, నీడ లేక జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి పిల్లల్లా రాలిపోయే ప్రమాదం పొంచిఉంది. ఈ పరిస్థితులను చూసి సూపర్ స్టార్ మమ్ముటి మనసు కరిగింది. ఎండలో బాధపడుతున్నవారికోసం సహాయక చర్యలు చేయాలనుకున్నారాయన. పరిచయస్తులు, తెలిసినవాళ్లకు ఫోన్లుచేసి, వ్యక్తిగతంగా కలిసి.. తనతో కలిసిరావాలని కోరారు మమ్ముటి. అందుకు వారూ సరేనన్నారు. తన ప్రణాళికకు ప్రభుత్వ సాయం కూడా బాగుంటుందని భావించిన ఆయన బుధవారం తిరువనంతపురంలో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిసి, సహకరించాలని కోరారు. మమ్ముటి ఆలోచనలు విన్న సీఎం అప్పటికప్పుడే ఒక నిర్ణయాన్ని ప్రకటించారు.
రేపు (గురువారం) అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకుని ఎండల తీవ్రతపైనే సమీక్షలు నిర్వహిస్తానని, ఇదే అంశం ఎజెండాగా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తానని సీఎం చాందీ వెల్లడించారు. మమ్ముటి చెప్పిన విషయాలను కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని సమాచారం. కేరళలో గత నాలుగు రోజులుగా ఎండలు తీవ్రస్థాయికి ఎగబాకాయి. పాళక్కడ, కన్నూర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను దాటాయి. శనివారం నాటికి 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఎండతీవ్రతతో బాధపడుతున్నవారికి సహాయం అందించేందుకు ముందుకొచ్చారు మమ్ముటి. అయితే ఆయన చేపట్టబోయే చర్యలు ఏమిటనే విషయం ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది కేరళలో మునుపెన్నడూలేని విధంగా ఎండ అధికంగాఉంది.