100 ఎద్దులను ఒకేసారి వదలగా..
వెల్లోర్: తమిళనాడులో దారుణం జరిగింది. ఆలయంలో దేవుడి దర్శనానికి బయలుదేరిన వ్యక్తిని ఓ ఎద్దు కొమ్ములతో కుమ్మేయడంతో తీవ్రంగా గాయపడిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ సమయంలో ఇప్పటికే నిషేధం విధించిన ఎరుతు విదుమ్ విఝా(బుల్ రేస్) నిర్వహించడమే ఇందుకు కారణమైంది. వివరాల్లోకి వెళితే.. సంక్రాంత్రి పండుగ సందర్భంగా తమిళనాడులోని వెల్లోర్ జిల్లా వెల్లకుట్టాయ్ అనే గ్రామంలో ఎద్దుల పరుగుపందెం ప్రారంభించారు.
ఇది కూడా జల్లి కట్టులాగే ఓ సంప్రదాయ పండుగ. దీనిని నిర్వహించే సమయంలో అందరూ దారి పొడవునా ఉండి వీక్షిస్తుంటారు. అయితే, పందెంలో భాగంగా ఒకేసారి వంద ఎద్దులను రేస్‌లోకి వదిలారు. వాటిల్లో ఒక ఎద్దు నేరుగా జనాలపైకి వెళ్లింది. పీ షణ్ముగం అనే వ్యక్తిని తన కొమ్ములతో కుమ్మేసింది. దీంతో అతడి ఎడమ దవడ తీవ్రంగా గాయాలవడమే కాకుండా శరీరం లోపల కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన 4.30గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. అతడిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా 6గంటల ప్రాంతంలో చనిపోయాడు. పోలీసులు దీనిని అసాధారణ మరణం కింద నమోదు చేసుకున్నారు.