కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ముజఫర్‌పూర్, డియోరియా షెల్టర్ హోంలలో చిన్నారులపై అకృత్యాల ఘటనలు కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆమె ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా షెల్టర్ హోంలలో జరుగుతున్న దారుణ ఘటనలు మరిన్ని వెలుగులోకి రావచ్చన్నారు. సంవత్సరాల తరబడి వీటిని మనం పట్టించుకోకుండా వదిలివేయడంతో ఇలాంటి దారుణ ఉదంతాలు చాలా ఉంటాయని తనకు తెలుసన్నారు.
ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని షెల్టర్ హోంలను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని ఆమె కోరారు. వారి నియోజకవర్గాల్లో వసతి గృహాల పరిస్థితిపై తనకు నివేదిక అందిస్తే తక్షణమే చర్యలు చేపడతానన్నారు. వేయి మంది చిన్నారులు, వేయి మంది మహిళలతో కూడిన అతిపెద్ద హోంలను నిర్మించి, మహిళలే సిబ్బంగిగా వీటిని నడపడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచించారు.
దీనికి అవసరమైన నిధులను తాను మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. షెల్టర్ హోంలలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment