
మన్మోహన్ సింగ్ అల్లుడికి మోదీ కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడుడికి ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఇంటెలిజెన్స్ వర్గాలకు, లా ఎన్ఫోర్స్మెంట్ ఎజెన్సీలకు ఆన్ లైన్ సమాచారం అందించే అత్యంత కీలకమైన దేశ ఇంటెలిజెన్స్ విభాగ నాట్గ్రిడ్(ది నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్)కు పూర్తి స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే పట్నాయక్ మోదీ సర్కారులో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.
మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాట్ గ్రిడ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిద్వారానే భారత ఇంటెలిజెన్స్ సమాచారం దానికి సంబంధించిన సంస్థలకు బట్వాడా అవుతుంటుంది. గుజరాత్ కు చెందిన పట్నాయక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అల్లుడు. చాలా కాలంగా ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు. అంతకుముందు అడిషనల్ డైరెక్టర్ గా సేవలందించారు. తాజా నియామకంతో నాట్ గ్రిడ్ వ్యవహారం మొత్తం కూడా ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంది. 2018 డిసెంబర్ 31 వరకు నాట్ గ్రిడ్ సీఈవోగా పట్నాయక్ బాధ్యతలు నిర్వహిస్తారు. అది ఆయన పదవీ విరమణ పొందే రోజు.