రిజర్వేషన్లపై ‘వైద్య’ దుమారం
• పునఃసమీక్ష అవసరమన్న ఆరెస్సెస్ ప్రతినిధి
• తీవ్రంగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. దళిత ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు వైద్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. దళిత వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీని విమర్శిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లకు పునఃసమీక్ష అవసరమని చెప్పారని జైపూర్‌లోని సాహిత్య వేడుకలో వైద్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శల దాడి మొదలవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ అధినేత, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ రిజర్వేషన్ దళితులకు ఎవరో ఇస్తున్న దానం కాదన్నారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కనీ, దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. గతంలో మోదీ కూడా తన ఒంట్లో ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అనడాన్ని గుర్తు చేశారు.
మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మట్లాడుతూ రిజర్వేషన్లను తొలగిస్తే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గోవాలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల సామాజిక స్థితిగతులు మెరుగుపడే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగించేంత బలం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వస్తుందనీ, బిహార్‌లోలా ఇక్కడా బీజేపీకి బుద్ధి చెప్పాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి ప్రజలను కోరారు.