Manmohan vaidya
-
రిజర్వేషన్లపై ‘వైద్య’ దుమారం
• పునఃసమీక్ష అవసరమన్న ఆరెస్సెస్ ప్రతినిధి • తీవ్రంగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: రిజర్వేషన్లను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని ఆరెస్సెస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. దళిత ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ తదితర పార్టీలు వైద్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. దళిత వ్యతిరేక పార్టీ అంటూ బీజేపీని విమర్శిస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కూడా రిజర్వేషన్లకు పునఃసమీక్ష అవసరమని చెప్పారని జైపూర్‌లోని సాహిత్య వేడుకలో వైద్య అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శల దాడి మొదలవడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ అధినేత, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మాట్లాడుతూ రిజర్వేషన్ దళితులకు ఎవరో ఇస్తున్న దానం కాదన్నారు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కనీ, దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత కాలం కొనసాగుతుందని అన్నారు. గతంలో మోదీ కూడా తన ఒంట్లో ప్రాణమున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని అనడాన్ని గుర్తు చేశారు. మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే మట్లాడుతూ రిజర్వేషన్లను తొలగిస్తే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గోవాలో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీల సామాజిక స్థితిగతులు మెరుగుపడే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగించేంత బలం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వస్తుందనీ, బిహార్లోలా ఇక్కడా బీజేపీకి బుద్ధి చెప్పాలని బహుజన సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి ప్రజలను కోరారు. -
'క్షమాగుణం ఉన్నందువల్లే లూటీ చేశారు'
హైదరాబాద్: పాశ్చాత్య అభివృద్ధి పద్ధతి వల్లే ప్రకృతి నాశనం అవుతోందని ఆరెస్సెస్ అధికార ప్రతినిధి మన్మోహన్ వైద్య అన్నారు. ఏకాత్మ మానవతా దర్శన్ తోనే అభివృద్ధి సాగాలని ఆయన చెప్పారు. రెండో రోజు ఆరెస్సెస్ సమావేశాలు ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. భారత ప్రజల్లో క్షమాగుణం ఉన్నందువల్లే విదేశీయులు లూటీ చేశారని అన్నారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు, ప్రకృతి వైపరీత్యాలకు దీన్ దయాళ్ చెప్పిన ఏకాత్మ మానవతా దర్శనే సొల్యూషన్ అని ఆయన సూచించారు. మరో అరెస్సెస్ నేత నందకుమార్ మాట్లాడుతూ కేరళలో రాజ్యహింస పెరుగుతుందన్నారు. అక్కడ జరుగుతున్న హత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకోవాలని అన్నారు. హింసను అరికట్టి శాంతిని పునరుద్ధరించాలని నందకుమార్ సూచించారు. కమ్యూనిస్టుల చరిత్ర అంతా హత్యా రాజకీయాలేనని నందకుమార్ అన్నారు. -
'రాహుల్ గాంధీ సాక్ష్యాలతో రావాలి'
ఉదయ్‌పూర్: మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. దానికి సంబంధించిన సాక్ష్యాలతో రావాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మన్మోహన్ వైద్య కోరారు. ఆర్ఎస్ఎస్ వాలంటీర్ల సమావేశంలో పాల్గొనడానికి రోజుల పర్యటన నిమిత్తం ఉదయ్‌పూర్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీజీ హత్యకు ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుందని, రాహుల్ గాంధీ కాదని వైద్య స్పష్టం చేశారు. ఓ ఆర్ఎస్ఎస్ వాలంటీర్ కోర్టులో రాహుల్‌ను సవాల్ చేయగా.. పారిపోయాడని ఎద్దేవా చేశాడు. రాహుల్ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలుంటే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని సూచించారు. గాంధీజీ హత్యకు సంబంధించిన చార్జ్‌షీట్‌లో సైతం ఆర్ఎస్ఎస్ ప్రస్థావన లేదని వైద్య గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలు అసత్యమని ఆయన కొట్టిపారేశారు. కోర్టు ఉగ్రవాదులని పేర్కొన్నవారికి రాహుల్ మద్దతిస్తున్నారని.. అసలు దేశంలోని న్యాయవ్యవస్థపై అతనికి నమ్మకముందా అని వైద్య ప్రశ్నించారు. -
'ఇలాగైతే దేశం విదేశీయులతో నిండిపోద్ది'
రాంచీ: ఓ అంశంపై ఆరెస్సెస్ దేశ వ్యాప్త చర్చకు తెర తీయనుంది. సరిహద్దు గుండా దేశంలోకి చొచ్చుకొస్తున్న బంగ్లాదేశీయుల కారణంగా అసోంలో స్థానికులు తగ్గిపోతున్నారని, 2047నాటికి అది ప్రమాదకర స్థాయికి పడిపోతుందని ఉపమాన్యూ హజారికా కమిషన్ ఇచ్చిన నివేదిక పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ అంశంపై వెంటనే దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇటీవల బెంగాల్ తోపాటు అసోంలో మారుతున్న జనాభా స్థితిగతులపై ఒక నివేదికన హజారికా కమిషన్ వెల్లడించింది. దీనిపట్ల ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశీయులు ఇలాగే చొచ్చుకొస్తూ ఉంటే దేశంలో భారతీయులు తగ్గిపోయి విదేశీయులు పెరిగిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని రేపు ఓ తీర్మానం ప్రవేశపెడతామని కూడా చెప్పారు. రాంచీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. ఇండియా-బంగ్లా సరిహద్దు అంశంపై సుప్రీంకోర్టు హజారికా కమిషన్ ను వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై నవంబర్ 5లోగా స్పందిచాలని కూడా సుప్రీంకోర్టు అసోంను ఆదేశించింది. -
'కొంత హోం వర్కు చేసుకుని వస్తే మంచిది'
ప్రధానమంత్రి మోదీపైన, ఆరెస్సెస్ మీద రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ, ఆరెస్సెస్ నేతలు దీటుగా స్పందించారు. రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడే ముందు కొంత హోం వర్కు చేసుకుని, కొంత పరిశోధన చేసుకుని వస్తే మేలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఎప్పుడు సెలవు మీద వెళ్తారో.. ఎప్పుడు పార్లమెంటుకు వస్తారో ఆయనకే తెలియదని, గడిచిన పదేళ్లలో అసలు పార్లమెంటుకు రాహుల్ ఎన్నిసార్లు వచ్చి అధ్యయనం చేశారని ప్రశ్నించారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ రాజకీయాలకు తనను తాను విద్యార్థిగానే చెప్పుకొంటారని, అందుకే ఆయన పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నేత నళిన్ కోహ్లీ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వేరేవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారేమోనని ఆయన అనుకుంటారని విమర్శించారు. ఇక రాహుల్ గాంధీ ఆరెస్సెస్ గురించి చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ వైద్య ఖండించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన నిరాశా నిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆరెస్సెస్ గురించి ఆయన అజ్ఞానం ఏంటో తెలిసిపోతోందన్నారు. సమాజంలో.. ముఖ్యంగా యువతలో ఆరెస్సెస్ పట్ల అభిమానం, మద్దతు, భాగస్వామ్యం అన్నీ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.