'కొంత హోం వర్కు చేసుకుని వస్తే మంచిది'
ప్రధానమంత్రి మోదీపైన, ఆరెస్సెస్ మీద రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ, ఆరెస్సెస్ నేతలు దీటుగా స్పందించారు. రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడే ముందు కొంత హోం వర్కు చేసుకుని, కొంత పరిశోధన చేసుకుని వస్తే మేలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన ఎప్పుడు సెలవు మీద వెళ్తారో.. ఎప్పుడు పార్లమెంటుకు వస్తారో ఆయనకే తెలియదని, గడిచిన పదేళ్లలో అసలు పార్లమెంటుకు రాహుల్ ఎన్నిసార్లు వచ్చి అధ్యయనం చేశారని ప్రశ్నించారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని వెంకయ్య స్పష్టం చేశారు. ఇక రాహుల్ గాంధీ రాజకీయాలకు తనను తాను విద్యార్థిగానే చెప్పుకొంటారని, అందుకే ఆయన పాఠాలు నేర్చుకోవాలని బీజేపీ నేత నళిన్ కోహ్లీ అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వేరేవాళ్ల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారేమోనని ఆయన అనుకుంటారని విమర్శించారు.
ఇక రాహుల్ గాంధీ ఆరెస్సెస్ గురించి చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ వైద్య ఖండించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఆయన నిరాశా నిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఆరెస్సెస్ గురించి ఆయన అజ్ఞానం ఏంటో తెలిసిపోతోందన్నారు. సమాజంలో.. ముఖ్యంగా యువతలో ఆరెస్సెస్ పట్ల అభిమానం, మద్దతు, భాగస్వామ్యం అన్నీ పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.