రాహుల్‌పై వెంకయ్యనాయుడు విసుర్లు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దుపై లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని, తాను మాట్లాడితే భూకంపం వస్తుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. రాహుల్‌వి చిన్నపిల్లాడి వ్యాఖ్యలని, అపరిపక్వతతో కూడుకున్నవని విమర్శించారు. అయినా రాహుల్ సెలవుల్లో మాత్రమే పార్లమెంటుకు వస్తారని, ఆయన రెగ్యులర్‌గా సభకు రారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూరితంగానే పార్లమెంటులో గందరగోళం సృష్టిస్తున్నదని, తమ అసలు స్వరూపం బయటపడుతుందనే భయంతోనే వారు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పార్లమెంటులో మాట్లాడనివ్వకపోవడంతోనే ఆయన జనసభల్లో మాట్లాడుతున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.
పెద్దనోట్ల రద్దు అనేది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని, తాను లోక్‌సభలోనే దీనిపై మాట్లాడలనుకుంటున్నానని రాహుల్‌గాంధీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి యావత్ దేశంలో ప్రసంగాలు ఇస్తున్నారు గానీ, లోక్‌సభకు రావడానికి మాత్రం భయపడుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు.