'ఇలాగైతే దేశం విదేశీయులతో నిండిపోద్ది'
రాంచీ: ఓ అంశంపై ఆరెస్సెస్ దేశ వ్యాప్త చర్చకు తెర తీయనుంది. సరిహద్దు గుండా దేశంలోకి చొచ్చుకొస్తున్న బంగ్లాదేశీయుల కారణంగా అసోంలో స్థానికులు తగ్గిపోతున్నారని, 2047నాటికి అది ప్రమాదకర స్థాయికి పడిపోతుందని ఉపమాన్యూ హజారికా కమిషన్ ఇచ్చిన నివేదిక పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ అంశంపై వెంటనే దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇటీవల బెంగాల్ తోపాటు అసోంలో మారుతున్న జనాభా స్థితిగతులపై ఒక నివేదికన హజారికా కమిషన్ వెల్లడించింది. దీనిపట్ల ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించారు.
బంగ్లాదేశీయులు ఇలాగే చొచ్చుకొస్తూ ఉంటే దేశంలో భారతీయులు తగ్గిపోయి విదేశీయులు పెరిగిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని రేపు ఓ తీర్మానం ప్రవేశపెడతామని కూడా చెప్పారు. రాంచీలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు. ఇండియా-బంగ్లా సరిహద్దు అంశంపై సుప్రీంకోర్టు హజారికా కమిషన్ ను వేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై నవంబర్ 5లోగా స్పందిచాలని కూడా సుప్రీంకోర్టు అసోంను ఆదేశించింది.