హర్యానా సీఎంగా ఖట్టర్ పేరు ఖరారు?
హర్యానాలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా మనోహర్లాల్ ఖట్టర్ పదవి చేపట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ సీఎం పదవిని జాట్లకు ఇవ్వాలా.. నాన్ జాట్లకు ఇవ్వాలా అనే విషయంలో నెలకొన్న సందిగ్ధత నుంచి బీజేపీ అధినాయకులు బయటకు వచ్చినట్లే తెలుస్తోంది. దాంతో ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన మనోహర్లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి అవుతారన్న విషయం స్పష్టమైపోయింది.
ఖట్టర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆయన కర్నాల్ స్థానం నుంచి కచ్చితంగా గెలుస్తానని ముందునుంచి చెబుతూ.. అలాగే భారీ ఆధిక్యంతో గెలిచారు. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. 60 ఏళ్ల వయసున్న ఖట్టర్.. ఇప్పటికీ బ్రహ్మచారే.
గత ఎన్నికల్లో హర్యానాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఈసారి ఏకంగా 47 స్థానాల్లో పాగా వేసింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90 మాత్రమే. అంత చిన్న రాష్ట్రంలో ప్రచారం కోసం ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తొమ్మిది సార్లు వచ్చారని, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్నారా అని కూడా ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా ఎద్దేవా చేశారు. కానీ ఎవరేమన్నా.. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.