అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Published Fri, Nov 11 2016 9:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
భారతదేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నా.. వాటిని ముందుగా తాము ఎవరిపైనా ఉపయోగించబోమంటూ ఇన్నాళ్లూ ఒక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం. కానీ అసలు అలా ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలని ప్రశ్నించి.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలనం రేపారు. ఒకవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో రక్షణ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ''మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి? బాధ్యాయుతమైన అణ్వస్త్ర దేశంగా ఉంటామని, దాన్ని బాధ్యతారహితంగా ఉపయోగించబోమని మాత్రమే చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇది నా ఆలోచన'' అని పరిక్కర్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అంశంపై ఇవన్నీ కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు.
రక్షణ శాఖ కూడా ఆ తర్వాత చేసిన ఒక ప్రకటనలో.. పారిక్కర్ చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే తప్ప అధికారికం కాదని తెలిపింది. ముందుగా అణ్వస్త్రాలు ఉపయోగించకూడదన్న విధానానికే భారతదేశం కట్టుబడిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. 1998లో నిర్వహించిన అణు పరీక్షల తర్వాత.. ముందుగా తాము అణ్వస్త్రాలను ఉపయోగించబోమన్నది తన విధానంగా భారతదేశం ప్రకటించింది.
తాను చేసిన ఈ వ్యాఖ్యలపై తర్వాత ఎలా ప్రచారం జరుగుతుందో కూడా పరికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణు విధానాన్ని మార్చేసుకుందని మీడియాలో వచ్చినా వస్తుందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ విధానంలో మార్పు కాదని, ఒక వ్యక్తిగా తాను మాత్రమే అలా భావిస్తున్నానని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందువరకు పాకిస్థానీ రక్షణ మంత్రి తరచు భారతదేశం మీద అవసరమైతే అణు దాడికి కూడా వెనుకాడేది లేదని బెదిరించేవారని, కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు అలాంటి బెదిరింపు ఒక్కటి కూడా రాలేదని.. దాన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమని అర్థమవుతోందని కూడా పారికర్ అన్నారు.
Advertisement
Advertisement