మిస్ ఇండియా–2017గా మానుషి చిల్లర్
ముంబై: ఫెమినా మిస్ ఇండియా–2017 కిరీటాన్ని హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ కైవసం చేసుకుంది. ముంబైలోని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఆదివారం రాత్రి జరిగిన పోటీలో విజేతగా నిలిచి మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. మొత్తం 30 మంది పోటీ పడగా.. టాప్ 6లో మానుషి చిల్లర్, షెఫాలీ సూద్, సనా దువా, ప్రియాంక కుమారి, ఐశ్వర్య దేవన్, అనుక్రితి గుసైన్‌లు నిలిచారు.
మిస్ ఇండియాగా మానుషి, మొదటి రన్నరప్‌గా సనా దువా(జమ్మూ కశ్మీర్), రెండో రన్నరప్‌గా ప్రియాంకా కుమారి(బిహార్) ఎంపికయ్యారు. బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, ఇలియానా, బిపాసా బసు, అభిషేక్ కపూర్, విద్యుత్ జమాల్, ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రలు న్యాయమూర్తులుగా వ్యవహరించారు. ఢిల్లీలోని సెయింట్ థామస్ స్కూల్, సోనెపట్‌లోని ఉమెన్స్ మెడికల్ కాలేజీలో మానుషి విద్యాభ్యాసం కొనసాగింది. ఆమె తల్లిదండ్రులిద్దరూ వైద్యులే.